పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

48

వేదము వేంకటరాయశాస్త్రులవారి జీవితము

మిల్లరుదొరగారు శాస్త్రులవారికి దర్శనమిచ్చి మాటలాడుచు వారితో నిట్లనిరి. "ఈ యుద్యోగమును కోరిన అర్జీదారులలో మిమ్ము నేను అభిమానించితిని"

శాస్త్రులవారు ఈ యుద్యోగమునకు అర్జీపెట్టుకొనలేదు. కారణాంతరములచేత ముత్త్యాలపేట స్కూలులో ఒక శుక్రవారమునాడు వారు తమయుద్యోగమునకు రాజీనామా నొసంగిరి. స్వాతంత్ర్యమునకు భంగమైన యుద్యోగము వారికి సరిపడలేదు. ఆ మఱునాడే క్రిస్టియనుకాలేజి రంగయసెట్టిగారు వీరిని ఆహ్వానించి పండితపదవిని గ్రహింపుడని కోరిరి. అంతకుపూర్వము రాజమండ్రికి తండ్రిగారికడకు పోవుటకు సంకల్పించి శాస్త్రులవారు ప్రయాణసన్నద్ధులై యుండిరి. దీనిచే నిలిచిరి. మిల్లరుదొరగా రట్లు చెప్పగానే శాస్త్రులవారికి వెంటనే 'ఇదేదో మర్యాదకు భంగకరమైన వ్యవహారముగానున్నదే' అని తోచి ఇట్లనిరి. 'నేను అర్జీ పెట్టుకొనలేదు. మీరే ఆహ్వానించినందుచేత వచ్చితిని.' అని ఆంగ్లమున చెప్పిరి.

మిల్లరు: క్షమింపుడు. ఈమాట చెప్పినందులకు చింతిల్లుచున్నాను. మేమే మిమ్మాహ్వానించితిమి. మఱి తాము జనవరినెల నుండి ఈయుద్యోగము చేయవలెను.

శాస్త్రులవారు: అటులైన నాకీయుద్యోగ మక్కరలేదు. ప్రస్తుతము నేను స్కూలునౌకరికి రాజీనామానిచ్చితిని. పని లేక యున్నాను.'