పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అప్పుడు వీరికి ఎనిమిదేండ్లుండును, "ఎవడో ఒక వెఱిముండా కోదుకు. ఎవడైతే నీకేమి?" అని బదులు చెప్పిరి. ఇంచుక యైనను సదాశివశాస్త్రులవారి పటాటోపమునకును పరివారమునకును జంకలేదు. ఇదికూడ వేదమువారికి తగినట్లేయున్నదని తలంచి ఆవెనుక వేంకటరమణశాస్త్రులవారిని దర్శించి 'ఆ వెఱిముండా కొడుకు' వారి కుమారుడేయని వారు తెలిసికొనిరట.

ప్రతాపరుద్రీయములో వెఱ్ఱివాడు, 'నేను కండచీమను, ఏమనుకున్నావో? పట్టుకుంటే వదలను' అని శిష్యులను బెదరించును. విశాఖపట్టణములో వీరు నివసించిన యింటి పొరుగింటి యాతడు, ముసలివాడు, తన పడుచు భార్యను ఈవాక్యమునే పలికి నిరంతరము బెదరించుచుండువాడట. జ్ఞాపకముంచుకొని తమాషాగానుండినందున వెఱ్ఱివానికి తగిలించినారు.

బొబ్బిలియుద్ధనాటకములో ఐదవయంకమున సిఫాయీలు తిరుగబాటు చేయుచున్నారనియు, సారాయిలేనిది వారు యుద్ధముచేయరనియు ఒక సిఫాయి బుస్సీకి నివేదించును.

"బుస్సీ - అవును మామాటగా బొడ్మిన్‌తో వారికి సారాయి మామూలు కొలత ప్రకారము ఇమ్మనిచెప్పుము."

అనిచెప్పును. ఈ 'బొడ్మిణ్ అనుపేరు విశాఖపట్టణములో నొక సారాయి దుకాణదారుని కుండెను. వినిన క్రొత్తలో చాల వేడుకగా నుండినందున సమయము దొరకినప్పుడు ప్రయోగించినారు.