పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/225

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మొదలైనవాని నుంచి పద్యములను ముద్రించుటలోగాని, వారి పద్ధతులను చూచి మనము నేర్చుకొనదగిన విషయములు పెక్కులుగలవు. శృంగారనైషధముద్రణ మొక కళగా నెఱవేర్చిరి.

కూర్చుండినచోటినుండి కదలక గ్రంథావలోకమునందే రేయుంబవలు కాలముగడపువారికి క్రమముగా కొన్ని వాడుక లేర్పడుట సహజము. తాతగారికి దినమునకు లెక్కలేని పర్యాయములు కాఫీత్రాగుట యలవాటైనది. అదిలేనిదే వ్రాత జరుగదు. తాము చదువుకొనుగదిలో నొకమూల కాఫీకై ప్రత్యేక మొకబల్లయు, దానిపై నింగ్లీషుదొరలపద్ధతిని కాఫీ పరికరములన్నియు నుండెడివి. తోచినప్పుడంతయు కాఫీచేసికొని త్రాగుచు చదువుకొనుచు నుండెడువారు. వారి కాఫీరుచి అత్యద్భుతముగా నుండెడిది. కొందఱు మిత్రులు కేవలము ఆకాఫీని రుచిచూచుటకొఱకే వారికడకు ఏదోమిషపెట్టి వచ్చుచుండువారు. వారి యధికమనోవ్యాపారమునకు ఇట్టిదిలేనిచో అంతపని సాధ్యమైయుండెడిదిగాదు. ఆహార విషయములలో ఎంత మాత్రము శరీరమును కృశింప జేసికొనలేదు. బీరువలో ఎప్పుడును బిసకత్తులును, గొల్లభామమార్కు డబ్బాపాలు, 'కాడ్లివరాయిలు' మొదలైన వస్తువులుండెడివి. ఒక్కనిమిషమైనను తమ జీవితమున వ్యర్థపఱుపలేదు. హోటలుకు పోయివచ్చినను, ఇంట ఫలహారము చేయంచుకొని భుజించినను కాలహరణమగునని వారి భయము. విస్తరికడ నాలుగు నిమిషములు కూడ కూర్చుండువారు