పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/226

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కారు. తమతో వ్యర్థముగా మాటలాడవచ్చువారిని వెంటనే పంపివేయువారు.

కాలహరణమగుననియే ద్రవ్యవిషయములలో కూడ ఎక్కువపట్టింపు వారికుండినదికాదు. తాతగారిని 'తాము సంపాదించినదానిలో, సరిగాలెక్కలుచూచుకొనుచు జాగ్రత్తగానుండిన, చాలధనము మిగిలియుండునుగదా' అని యొకరనగా తాతగారు 'నాకు ధనము మిగిలియుండును గాని ఆముక్తమాల్యదా శృంగారనైషధములకు వ్యాఖ్యలు వ్రాసియుండలేనుగదా' అనిరి. వారికి కావలసినది కీర్తిగాని ద్రవ్యముగాదు.

ధర్మశాస్త్ర విషయములలోను సాంఘిక విషయముల యందును తాతగారు కేవలము పూర్వాచారపరాయణులుగారు. మత సాంఘిక విషయములలో మార్పుండవలయును నభిప్రాయము కలవారేయైనను ఆమార్పు క్రమముగానేర్పడవలయునే గాని బలాత్కారముగా తటాలున అన్నిటిని తలక్రిందులు చేయునదిగా నుండరాదనువారు. బ్రాహ్మణులలో లెక్కలేని శాఖాభేదము లనవసరములనియు ఆంధ్రులుగాని ద్రావిడులుగాని, నియోగులుగాని వైదికులుగాని పరస్పర సంబంధములు చేయుటలో తప్పులేదని వారియభిప్రాయము. అట్లే పలువురకు సలహానిచ్చియున్నారు.

ఆంధ్రదేశమందలి సమకాలికపండితులలో మహోన్నతస్థానము నందినారు. బాల్యములో తరగతులలో వారి తావు తప్పింప నొరులతరము కానట్లే ఆంధ్రపండితులలో వారితావు