పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/213

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తాలుకా ఇందువూరుగ్రామ్యవాస్తవ్యులు, భూస్వాములు శ్రీయుతులు ఎఱబ్రోలు రామచంద్రారెడ్డిగారు ....... నాకు ఏతద్గ్రంథ ముద్రణపూర్తికై అప్పుడప్పుడు రు. 2500 ల పరిమితిం జెందువఱకు విరాళమొసంగిరి.' ఈవిధముగా నీగ్రంథము 1927 సం జులయినెలలో వెలువడినది. 'చేసెదనింకదత్పరత సేవలు చూడికుడుత్త దేవికిన్‌' అని 1913 సం కావించిన ప్రతిజ్ఞను ఇన్నాళ్ళకు చెల్లించుకొని 'చేసితినిప్డు తత్పరత సేవలు చూడికుడుత్తదేవికిన్‌' అని ముద్రించినారు. ఆముక్తమాల్యద ముద్రితమై వెలువడినప్పుడు వారిహర్షమునకు మేరలేదు.

'ఇన్ని కడగండ్లపాలయి యిపుడుదీని నచ్చుబొత్తంబుకా గంటిహర్ష మెసగ' అని వ్రాసినారు.

1926 సం మున కంటి ఆపరేషను జరిగినదికాని దృష్టి చక్కగా కుదురలేదు. అట్లే ఆముక్తమాల్యదకు ప్రూపులు దిద్దిరి. లెక్క లేని అచ్చు దప్పులుపడినవి. వానిని చాలవరకు సవరించిరి. మిగిలినవి చదువరులకే వదలిరి.

ఆముక్తమాల్యద ప్రకటితమైన సంవత్సరాంతమున ఆంధ్రవిశ్వవిద్యాలయమువారు తాతగారికి కళాప్రపూర్ణ బిరుదము నొసంగి సత్కరించిరి. ఆనాడే బెజవాడ పురపాలక సంఘమువారు వీరికి తమపురమున సర్వస్వాతంత్ర్యములను ఇచ్చి (Freedom of the city of Bezwada) గౌరవించిరి. ఇట్టి గౌరవములనందిన ప్రథమాంధ్రకవిపండితులు వీరే.