కొందఱు సుప్రసిద్ధనాటక రచయితలు తమ విదూషకులకు విపరీతమగు మేధను
బ్రసాదించినారు. ఇందుకుఁ బ్రథమ కారణము వారు సంఘవిమర్శకు లగుటయే
యనవచ్చును. మహాకవి కాళిదాసు శాకుంతలములోని విదూషకునిచే 'నేను మృత్పిండ
బుద్ధి' నని యనిపించినాఁడు. ఇట్టి యాత్మవిమర్శ విదూషకులకు సహజము.
అందుమూలముననే వీరు తమ్ముఁదాము విమర్శించుకొని యవహేళనఁ జేసికొనఁ
గలుగుట తటస్థించుచున్నది. ఈ కారణమున విదూషకులు లోక సామాన్యమైన
భ్రమప్రమాదములకు లోనుగాని జిజ్ఞాసువులు. సత్యాన్వేషణపరులైన విజ్ఞానభిక్షార్థులు.
విజ్ఞానాధి దేవతయైన విఘ్న రాజు హాస్యరసప్రియుఁడు. హాస్యరసాధి దేవత. సిద్ధి
బుద్ధియను భార్యలఁ గలిగియు నస్థలిత బ్రహ్మచారి. తన తల్లిదండ్రుల వివాహ
వేళయందును విఘ్న నాయకుఁడు తన్నుఁ గొల్పించుకొనిన విచిత్ర దైవతము!
జిజ్ఞాసువు నిత్య జీవితమున కించుక దూరమునఁ గూర్చుండి యోచనానిమగ్నుఁడై కనుఁగొనిన నది యొక హాస్యరూపకముగఁ గన్పించును. అందవహేళనలు నతనికి గోచరించును. అతనికి జీవయాత్ర సమస్తమును మందబుద్ధు లొనర్చుకొనునొక విందుగఁ గన్పట్టును. అతఁడు దీనిని బరిహరింపనుంకించును.
పరిహాసకుడందే యుండి విమర్శించుచు సత్యనిరూపణ మొనర్చుటకు శాయశక్తుల యత్నించును. ఈ మహత్తర కార్యమున నతనికి మనోజ్ఞ సాధనము లాశాభంగము నొందిన వ్యక్తులు, ప్రాణులు. వారి జీవితములు అనుకొనినట్లు జరుగక పోవుటయందును హాస్యముత్పన్న మగుచున్నది. జగమునఁ 'దానొకటి దలచిన దైవ మొకటి తలఁపకున్న’ విమర్శనకు స్థానమెక్కడిది? హాస్యమున కాధార మెక్కడిది?
అనేక జాతులయందుఁ బుట్టిన హాస్యరూపకములలో నాయాజాతుల యాచారవ్యవహారములలోని కాఠిన్యము, నిర్దయ, నిష్ప్రయోజకత, వైరూప్యములు విదూషకుల మూలమునఁ బరిహాసపాత్రములగుచుండును. సత్యమునకు దూరదూరముగ గమించు వ్యక్తులిట్టి రూపకములఁ బాత్రలగుచుందురు.
'మొట్టమొదటి నాగరిక స్త్రీ ప్రియుని భుజబంధమున నొదిగి పిమ్మట తెలివి నొంది నా దుస్తులు నలి' గిపోయిన వనుకొనుటలో సాంఘిక హాస్యరూపకములు జన్మించియుండునని యొక నాటకసాహిత్యవేత్త పలికినాఁడు. ఇట హాస్యము శృంగార రసము నంటిపెట్టుకొని యుండుటచేఁ బుట్టినది.
భరతాచార్యుఁ డీ కారణముననే 'శృంగా రాద్ధి భవేద్ధాస్యం' అని ప్రవచించినారు. మిగిలిన రసములను హాస్యమంటిపెట్టుకొని యున్నట్లుఁ జూపుట కష్టము కాదు.
96
వావిలాల సోమయాజులు సాహిత్యం-4