Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


విమర్శించి, సంస్కరించి నీతి నుపదేశింపఁ బూనుకొను హాస్యజ్ఞులును నుందురు. హాస్యప్రియులకుఁ బ్రతివస్తువును, బ్రత్యంశమును, హాస్యరసాంతర్భూతమై దర్శన మొసగును. అతని చమత్కార ప్రియమైన దృష్టిపడిన ప్రతి వస్తువును బ్రత్యంశమును హాస్యరసోత్కరమై యెప్పును.

ఉత్తమమైన హాస్యమున కుత్తమమైన సంఘ ముండితీరవలయును. సంఘమునందలి సంస్కృతి ననుసరించి హాస్యరసజ్ఞులుత్తమ మధ్యమాధమ హాస్యములతో సంతృప్తిఁ బొందించుచుందురు. తిట్టుకవితల, వికటకవిత్వములఁ బ్రాకృతమునఁ బరిభాషలఁ జెప్పుకొని యానందించు జాతు లనాగరకము లనుట యనుచితము కాదు.

వెక్కిరింపు నవ్వు కాఁజాలదు. 'లలితమైన హాస్యము జాతికి వ్యాఖ్యాన' మని యొక తాత్త్వికుఁ డూహించినాఁడు. నిజము. అది సంఘమునందలి సుఖదుఃఖముల మానమర్యాదల నాచారవ్యవహారముల సున్నితముగ విమర్శించును గదా! సరసోక్తి చతురుఁడైన హాస్యజ్ఞుఁడతని యుక్తి నెవనిపైఁ బ్రయోగించునో యతనిఁ బైకి నవ్వించినను హృదయమున గిలిగింతలు పెట్టి మార్పఁగల శక్తి సంపన్నుఁడై యుండును. 'హాస్య-గంధోళిగాఁ' డట్లుగాదు. ఎదుటివాని కెట్టి ప్రయోజనమును జేకూర్చ లేకుండుటయే గాక తనపైఁ గ్రోధము నసహ్యమును గల్పించుకొని యపకీర్తి పాలగును.

151[1]భరతాచార్యుడు 'శృంగారానుకృతి ర్హాస్యం' అని ప్రవచించినాఁడు. శృంగారము ననుకరించుటయే హాస్యము. ఇట ననుకృతియన్న సాదృశ్యము కాదు; సాదృశ్యము ననుకరించుట వలన నేర్పడిన వైరూప్యము. సంస్కృతనాటకము లందు సర్వసామాన్యముగ శృంగారనాయకులైన ధీరలలితుల ననుకరింపఁబోయి విదూషకులు వైరూప్యమును బొంది ప్రేక్షకులకు నవ్వుఁ బుట్టించు చుందురు. 'విశేషేణ దూషయతీతి విదూషకః' అను వ్యుత్పత్తి మూలముననే వీరనుకృతులు గారనియు వైరూప్యులనియు వ్యక్తమగుచున్నది. వికృత వేషభాషా చేష్టాదుల వలన వీరు హాస్యరసపోషణమును జేయుచు నాయకులకుఁ బ్రతియోగవ్యక్తులై బ్రవర్తిల్లుచుందురు. సంస్కృత నాటకములలోని విదూషకులు సర్వసామాన్యముగ నాలస్యావహిత్థ నిద్రాదుల వలన నవ్వుబుట్టింప యత్నింతురు గాని, హృదయమును గిలిగింతలు పెట్టింపఁగల

చిన్మయహాసముల సృజింపశక్తి గలవారు కారు.
  1. 151. భరతాచార్యుఁడు - నాట్యశాస్త్ర కర్త.

____________________________________________________________________________________________________

మణిప్రవాళము

95