Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


కనుపించు నవ్వులలో 'నానందసూత్రార్థముల నన్వయించు తపస్వి' పసిపాప చారుస్మితహాస ముత్తమోత్తమమైనది. విందు సందర్భముల హాస్యచతురుల సంభాషణ నైపుణ్యమువలన వినిపించుచుఁ గనుపించు హాస్యములు కేవల 'స్వరమేళలు'. అన్నిటికి నేకాన్వయము గోచరించును.

నవ్వు వలనఁ గలుగు ప్రయోజనముల గుర్తించిన వ్యక్తి నవ్వుటకుఁగాని నవ్వించుటకుఁ గాని వెనుదీయఁడు; హాసమును దృణీకరించి శిలాప్రతిమయై 'శిష్ఠుఁడ' ననుకొనఁడు. జగత్తత్త్వము నవగత మొనర్చుకొని యాలోచించువానికి విషాదాంత రూపకముగ ననుభవించువానికి నది యొక హాస్యనాటకముగ నెసఁగును.

మానసిక శాస్త్రవేత్తలు నవ్వునకు మూలకారణము సంతోషమనిరి. అగుచో మనకు నవ్వు గల్గించు నంశము లన్నియు సంతోషప్రదములు కావు. వికార వేషములు, విపరీత చేష్టలు, విరుద్ధభాషలు మనకు నవ్వు పుట్టించుట లోకానుభవము. నాటక రచయితలు విరూపములగు పాత్రల సృజించి వారి రూప చేష్టాదికముల మూలమునఁ బ్రేక్షకుల నవ్వింతురు. పరిహాసకులు నీ మార్గమునే యనుసరించి యన్యులకుఁ బ్రమోదము కల్గింతురు. కావున నవ్వు కలుగవలెనన్న నాంగి కాహార్య వాచి కాభినయముల నెటనో యొకట 'వికార' ముండి తీరవలయును. అందువలన సాహిత్యదర్పణకారుఁడు 'వికృతాకార వాగ్వేష చేష్టాదే ర్నర్తకాభవేత్ హాస్య' మని హాస్యస్వరూపమును నిరూపించినాఁడు. వాగంగాది వికారాదులను జూపుటవలనఁ బ్రేక్షకులలోఁ బుట్టిన చిత్తవికారరూపమైన వృత్తివిశేషమే హాసమని 148[1]పండిత జగన్నాథరాయలు 'వాగంగాది వికార దర్శన జన్మా వికాసాఖ్యోహాసః' అనుచోట వ్యక్త మొనర్చినాడు.

కొందఱు మానసిక శాస్త్రవేత్తలు దీనికి భిన్నముగ వికృత వస్తువులను జూచుట వలనఁ గలుగు హృదయవేదనను వెలికి రానీయకుండుటకో, లేక మఱచుటకో నవ్వు పుట్టుచున్నదని నమ్ముచున్నారు.

మనస్సు క్లేశమునొంది యున్నవేళ నే చమత్కృతినో యొనర్చి నవ్వించెడి వ్యక్తి యెవరైన వచ్చిన నెంత బాగుండుననిపించును. అట్టిస్థితియందు నవ్వు పుట్టించు వస్తువులు కన్పించిన నొక్కించుక శాంతి చేకూరినట్లు తోఁచును. దీనినిబట్టి యొక విధమగు శారీరక మానసిక వ్యథలనుండి యుద్ధరింపగల శక్తి నవ్వునకున్నట్లు ద్యోతకమగుచున్నది. వాయుకోశములఁ బరిశుభ్ర మొనర్చుట, క్రమముగ

రక్తప్రసరణము సాగునట్లు చూచుట, నవ్వునకుఁ దెలియునని వైద్యశిఖామణుల
  1. 148. పండిత రాయలు - రసగంగాధరాది గ్రంథకర్త; క్రీ.శ. 15వ శతాబ్ది సుప్రసిద్ధ పండితుడు

____________________________________________________________________________________________________

మణిప్రవాళము

91