హసితం స్యాత్, మధుర స్వరం విహసితం సశిరః కంపస్మిత ముపహసితం, అపహసితం
సాక్షం విక్షిప్తంగమ్' అని సాహిత్య దర్పణకారుఁడు. అతని మతమున మొదటి రెండును
నుత్తమములు, కడపటి రెండు నధమములు. బౌద్ధులు వీనికి మఱి రెంటిని చేర్చి
నవ్వెనిమిదివిధము లనినారు.
వయస్సునుబట్టి, వారి సాంఘిక స్థితిగతులను బట్టి నవ్వు నెన్ని రీతులనైన విభజింపవచ్చును. స్థూలముగ నవ్వు సర్వసామాన్య మానవ సంఘమున నుదాత్తానుదాత్తములనెడి ద్వివిధ విభేదములతో నొప్పుచున్నది. సంభాషణ సందర్భముల నుదాత్త వర్గములం దుత్తమహాస్య మనుదాత్తమును జయించినట్లు కన్పించును. కాని సర్వసామాన్యముగ దీనికి వైపరీత్యమే లక్షణము. ఇందువలన నుత్తమ హాస్యము కరుణాత్మకమై యుండుననియును, నీచహాస్య మల్పత్వము వలన జన్మించు ననియు నొక తాత్త్వికుఁడభిప్రాయమి చ్చినాఁడు.
మంద యర్థము లేని నవ్వు నవ్వును, ఉదాత్తవ్యక్తి యుత్తమ హాస్యమునకే దీర్ఘముగ నిశ్శ్వసించును. ఘనహాసములకు నిశ్శ్వాసము తోఁబుట్టువు. ఆనందకరమగు హాసమా భావుకుఁ డూహించినరీతి దయార్ద్రహృదయము నుండిగాని బహిర్గతము కాదు. ప్రపంచమున నిత్యమును నవ్వు నవ్వులలో నుత్తమమైన జాతికిఁ జేరినవి మిక్కిలి యరుదుగ నుండును. ఇట్టి వైచిత్రి నెఱిఁగినవాఁ డగుట వలననే థాకరీమహాశయుఁడు 'ఒక మంచినవ్వు గృహమునకు భానూదయ' మని యనవలసి వచ్చినది. బుద్ధిని గిలిగింతలు పెట్టఁగలిగిన నవ్వుకంటె రమణీయమైన వస్తు వే లోకమున నున్నది? 'లలితమైన హాస్యము జాతి కుపనిషత్తు వంటిది' ఇది సూత్రప్రాయముగ సునిశితముగ విజ్ఞానమును బ్రసాదింపఁగలదు. దీనియందే జాతి మానమర్యాదలు నుచ్చనీచలు హావభావములు ప్రతిఫలించుచుండును. ఒక జాతి హయహేషితమును బోలి నవ్విన దాని హృదయకాఠిన్యమును గూర్చి, ప్రాకృతస్థితిని గూర్చి వేఱుగఁ బలుక నగత్యము లేదు. నవ్వలేక జంతుకోటివలెఁ గేవల మేడ్వఁగలిగిన నా జాతి మరణస్థితి ననుభవించుచున్నదన్న మాట!
నవ్వునకు శబ్దమున్నది; రూపమున్నది. అందుచే నది కనుపించును; వినిపించును. నవ్వులలో మధురమైనది విమలమైనది కన్యకల ముగ్ధహాసము. ఇట్టి కమనీయహాసమును గని మనమునఁ జొక్కి డిక్విన్సీ యొకమాఱు 'సృష్టిలో నున్న మధుర కలధ్వనులలో మంజులమైనది కన్యకల కమనీయహాస' మనినాఁడు.
వావిలాల సోమయాజులు సాహిత్యం-4