పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/852

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అంటే మనకు చంద్రుడంటే ఎంతో అభిమాన మన్నమాట. అతనికి నామకరణం చేయటంలోనే 'చది' (ఆహ్లాదనే ధాతువును గ్రహించారు శబ్ద మహర్షులు. ఓషధీశు డతడేనని ఆంతరంగికంగా ఆమోదించారు. 'అబ్జ' శబ్దంతో అతన్ని నీటబుట్టినవాడన్నారు. అతడు జైవాతృకుడు పైరుపచ్చలను బ్రతికించేవాడు. అమృతతుల్యమైన సోమాన్ని ప్రసాదించడం వల్లనే సోముడైనాడు. స్థితిని బట్టి శశిధరుడూ, మృగాంకుడూనూ. 'వాగ్వై బృహతీ తస్యా ఏష పతి స్తస్మాదు బృహస్పతిః' అయిన బృహస్పతికి శిష్యుడు. తారాజారుడు. ఐతేనేం? శంకర శీర్షానికి అవతంసమైనాడు.

వైదిక సాహిత్యంలో చంద్రుడు 'సూర్యచంద్రమసు' అనే దేవతాద్వంద్వంలో ఒకడు. సోమయాగ విశేషాలను చెపుతూ "వాగ్దేవత కోసం స్థూలశరీరుడైన పశు వును ప్రాణపంచకాన్ని వరుణుడికీ, నేత్ర ద్వయాన్ని సూర్యుడికీ, మనస్సు చంద్రుడికీ, శ్రోత్రాలను దిక్కులకూ, జీవాత్మను ప్రజాపతికీ ఇవ్వవలసిందని తైత్తిరీయ బ్రాహ్మణంలోని ఒక అనువాకం అనుశాసిస్తున్నది.

చంద్రుడు గంధర్వుడు. “సుషుమ్నః సూర్యరశ్మి శ్చంద్రమా గంధర్వః" అని శ్రుతి. 'గాంధరిత్రేతి గాంధర్వః' అని నైఘంటికులు. ఇక్కడ సూర్యకిరణమే గోవు. సుషుమ్న మనే సూర్యకిరణాన్ని ధరిస్తున్నాడు కాబట్టి చంద్రుడు గంధర్వుడు. నక్షత్రాలనే అప్సరసలతో మిథునభావాన్ని పొంది చంద్రుడు క్రీడిస్తున్నాడని శతపథ బ్రాహ్మణఋషి కల్పన.

సూర్యచంద్రులిద్దరూ అశ్వినీ దేవతలు. 'అశ్వ' శబ్దానికి యాస్కాచార్య నిరుక్తం ఇలా ఉంది

“కిం చంద్రమాః ప్రత్యుపకారలిప్సయా కరోతి గోభిః కుముదావబోధనమ్ | స్వభావ ఏవోన్నత చేతసాం సతాం పరోపకారవ్యసనం హి జీవితమ్ ||"

“చంద్రుడు ఏ ప్రత్యుపకారాన్ని కోరి కలువలకు వికాస మిస్తున్నాడు? గొప్పవారు పరోపకారాన్ని చెయ్యటంలోనే జీవితాన్ని వినియోగిస్తారు” అని కవి ప్రకృతిసిద్ధమైన ఒక రహస్యం మూలంగా మానవజీవితం మీద నిశితవిమర్శ చేశాడు.