Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/851

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

భారతీయుల అనేక ఆచార వ్యవహారాలు చంద్రుడిమీద ఆధారపడ్డవి. చాంద్రమానమే కర్మకాండకు ఆధారము. కృచాంద్రాయణమూ, సూర్యచంద్రుల నోములూ మన ఆచారాలు. రెండు సంక్రాంతుల నడుమ గౌణచంద్రుడూ, ముఖ్యచంద్రుడూ ఇద్దరూ కనిపిస్తే కొన్ని కర్మలు ఆగిపోతవి.

'కుముదాప్త బాంధవుని కొమ్ము తరిగితే కాటకం తప్పదని ముసలమ్మల నమ్మకం. జాతకచక్రాలలో “చంద్ర లగ్నాత్” చూడవయ్యా ఎలా ఉందో నంటాడు శాస్త్రవేత్త తోడి జ్యోతిష్కుడితో. హృద్రోగాలు పెరిగి వైద్యులతరం కాకపోతే “కాస్త చంద్రుడికి జపం చేయించి, మానెడు సోలెడు యవలు దాన మిప్పించండి, నయం కాక దాని తాతకు అచ్చామా?" అనే ధీమాతో సలహా చెబుతాడు సిద్ధాంతి.

“ఆదిత్యాత్ చంద్రమసం చంద్రమసో వైద్యుతమ్" అని ఛాందోగ్యోపనిషత్తు పలుకుతున్నది. అయితే ఈ చంద్రలోకం నేరని చెబుతున్నారు నేత్తలు. అగ్నిహోత్రాది కాలైన వైదికకర్మలుగానీ, సప్త సంతానాదికాలు గానీ చేసినవారు చంద్రలోకాన్ని పొందుతారట! ఉత్య్రాంతి చెందిన జీవుడు రాత్రి దగ్గరకూ, రాత్రి కృష్ణపక్షం వద్దకూ, అది దక్షిణాయనం దగ్గరకూ తీసుకోపోతాయి. జీవుడు అక్కడనుంచీ భౌతికాకాశాన్నీ, దానినుంచి చంద్రలోకాన్ని చేరి ఉదకశరీరాన్ని పొంది, కర్మ క్షయమయ్యేవరకూ సుఖంగా ఉండి, తరువాత ఆకాశాన్నీ, వాయువునూ పొంది మబ్బై వానగా మళ్లీ అవని మీద అవతరిస్తాడు.

చంద్ర చంద్రికల మీద మమకారం చేతనే శాస్త్రకర్తలు సహితమూ గ్రంథాలకు చంద్రిక, కౌముది ఇత్యాదిగ నామకరణం చేశారు. మేఘవిజయ కవి హైమకౌముది, భట్టోజీ దీక్షితుని సిద్ధాంత కౌముది, జయదేవుని చంద్రాలోకము - ఇత్యాదులు నిదర్శనాలు.

ప్రణయవిహ్వలులైన నాయికానాయకుల చేత అనేక అచేతనాలను దూతలుగా చేసింది కవిలోకం. మేఘుని ఆహ్వానించి మేఘదూతమూ, శుకాలకూ, హంసలకూ అనంత వాడిమను ప్రసాదించి శుకదౌత్యాలూ, హంసదౌత్యాలూ నడిపించారు కవులు. కృష్ణ చంద్రతర్కాలంకారుని సీత రామచంద్రునితో దౌత్యం నెరపటానికి చంద్రుణ్ణి ఆహ్వానించింది. ఆధునికులలో విశ్వనాథవారి 'శశిదూతము' 'సహస్రశీర్షా పురుష' వలె వేయి పడగలు విప్పినది.