తప్పిదాలను చేసినవారిని, అవమానించదలచినవారిని గాడిదపై ఎక్కించి ఊరేగించటం అన్ని దేశాలలోనూ ఆచారంగా ఉన్నదనటానికి, మహాజ్ఞాని సోక్రటీస్ అజ్ఞానులైన గ్రీకులవల్ల పొందిన శిక్ష నిదర్శనముగా ఉంది.
మానవజాతి సాంస్కృతిక చరిత్రలో గోయుగం, దాన్ని త్రోసిపుచ్చి, అశ్వయుగం, అశ్వయుగాన్ని త్రోసిపుచ్చి యాంత్రిక యుగం వచ్చినట్లు స్పష్టరూపంగా గోచరిస్తున్నది. కాని మానవచరిత్రలోనే ఆదిగ్రంథమైన ఋగ్వేదంలో గోయుగం మహోన్నతంగా, ప్రస్ఫుటితమౌతున్నది. అంతకు పూర్వమైన ఆధారాలేవి లభించినా, గార్దభయుగం ఒకటి ఉండి తీరుతుందని, మానవుడు సాంస్కృతికంగా కళ్ళు తెరువక పూర్వమే గార్దభం అతడికి అనంతంగా సేవ చేసిందనీ మా దృఢనిశ్చయం. ఈ జాతి అదృష్టం మానవజాతి అజ్ఞానం వల్ల తారుమారైంది. 'Symbol of cow is a purity and a live epic of India' – అన్నాడు మహాత్ముడు. నేడు ఈ జాతి నుద్ధరించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ నాడు నాకు ఇంత గార్దభాభిమానమున్నదని చెప్పుకోటానికి సంశయించలేదు. మనకు రాన్ బ్రీవెర్ అనే జర్మనీ దేశీయుడు మార్గదర్శి సౌత్ హాల్ లో గార్దభ ఘోషాన్ని నడుపుతూ 'ధూమపత్రరాజు', 'స్వర్ణరాజు' ఇత్యాదిగనే తాను తన్ను “గార్దభ రాజు” నని నిర్భీతితో వ్యవహరిస్తున్నాడు. మీరు గార్దభ జనోద్ధరణకు పూనుకొంటారనీ మా పతిత జనోద్ధరణ సంఘం మీకు సర్వవిధాలా సహకరిస్తుందని మనవి చేస్తూ, సభాసభ్యుల హర్షధ్వానాలను అందుకొని నా ప్రశస్త రాసభోపన్యాసాన్ని పూర్తి చేశాను.