పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/846

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పోయె ఓ పల్లెగాడిదా! పరిగెత్తి అబ్బాయికి పాలిచ్చి పోవె” అన్న జానపద సాహిత్యంలో పేర్కొనదగ్గది.

కృష్ణావతారం సమయంలో గార్దభం చేసిన మేలు లోకం ఎన్నడూ మరువజాలదు. చెరసాలనుంచి చిన్ని కృష్ణుని గోకులానికి చేర్చేటప్పుడు వసుదేవుడు గాడిద కాళ్ళు పట్టుకున్న విషయం పురాణప్రసిద్ధం. ఎప్పుడో రజకుని ఇంట దొంగలు పడ్డారని ఓండ్రపెట్టి మేల్కొలిపిన సందర్భాన్ని అపార్థం చేసుకుని, వసుదేవుడు తొందరపడి గాడిద కాళ్ళు పట్టుకున్నాడేగాని దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం పరమాత్మ అవతరించిన అంశాన్ని అర్థం చేసుకోలేనంతటి అవ్యక్తప్రాణి కాదు గార్దభం.

ప్రాచీన రాజవంశీయులలో గౌరవప్రదమైన జంతువులను తమ వంశచిహ్నంగా ఉంచుకోవటం కద్దు. దేవగిరి యాదవ రాజవంశీయులు మేషశిరాన్ని తమ రాజవంశ చిహ్నంగా నిలుపుకున్నారు. అలాగే గార్దభ వంశీయులు రాసభశీర్షాన్ని తమ రాజచిహ్నంగా స్వీకరించి ఉంటారనటంలో చరిత్రకు వ్యతిరేకత ఎక్కడా ఉండదనుకుంటాను.

అజ్ఞాని ఐన రజకుడు అపార్థం చేసుకుని కుర్కురాన్ని శిక్షించే బదులు గార్దభాన్ని చంపుకొని అప్రతిష్ఠ తెచ్చిపెట్టాడే గాని, ఆ కథాసందర్భంలో కూడా తప్పిదం గార్దభానిది కాదనే మా మతం. “సాదురేగిన తల పొలమున గాని నిలువదన్నట్లు" అప్పుడప్పుడూ గగ్గోలుగా ఓండ్రపెట్టినా గార్దభం అతి సత్వప్రధానమైన జంతువు. కనుకనే జీసస్ ప్రభువు ధర్మవిజయం కోసం జెరూసలెంకు ధర్మ జైత్రయాత్రకు బయలుదేరేటప్పుడు గార్దభవాహనారూఢుడై పయనించాడు.

ఎవరెన్ని రీతుల తిరస్కరించినా బిడ్డల తిరస్కారాన్ని పొందని జంతువులు లోకంలో గార్దభాలే. అందువల్లనే “బాలేయా” లన్న పేరు ఈ జంతుజాతికే దక్కింది. బాలేఖ్యువత్సే భవ్య హితాః బాలేయాః - తమ పిల్లలకు హితమైనవి. మనుష్య జంతువులతో సహా ఇలా బాలేయా లనిపించుకోదగ్గవి లోకంలో మరొక జంతుజాతి శశవిషాణం!

ఈ ప్రయాణసమయంలోనే గార్దభ పృష్ఠప్రదేశంలో నీలిమచ్చ ఏర్పడ్డది. అక్కడి కేశాలు ఒకటి రెండు పెరికి కోరింత దగ్గు ఉన్న పిల్లలకు మెడలో తావీజు కట్టితే, అది చేతితో తుడిచినట్లు తగ్గిపోవడం ఈ నాటికీ పశ్చిమాసియాలో స్థిరమైంది. అన్నట్టు ఆసియా సమైక్యతకు అత్యంతకృషి చేస్తున్న మనకు గార్దభం 'ఆసియా జంతువు'