యోగ్యత లేని పురుషుడు లేడు - కాని వాటిని 'సంఘటిత పరచువాడు లేడు అన్న పెద్దల సూక్తులే ఉద్బోధకాలు.
మర్నాడు సభాప్రారంభం కాకముందే వైయాకరణ సార్వభౌముడితో మాట్లాడి జంతు శబ్దాన్ని, మనుష్యులతో సహా సర్వజంతువులకు సామాన్యపరంగా వాడినట్లే ‘జన' శబ్దాన్ని సర్వజంతు సామాన్య పదంగా ప్రయోగించే రూఢిని కల్పించవచ్చునని అనిపించుకున్నాను. మా సంఘంవారి అంతర్వలయంలోని (Inner Circle) ప్రధాన సభ్యులొకరిద్దరికి నా ఉద్దేశాన్ని సూచించాను. “ఆత్మవత్ సర్వభూతాని” అన్న అంశం మీద నాకంటె విశేష ప్రత్యయము గలవాళ్ళు, ఉదార కరుణామూర్తులు, వైచిత్రియెడ విశేషాసక్తి గలవారు అయినవారు రాసభసముద్ధరణ విషయంలో సర్వవిధాలా తోడ్పాటిస్తానన్నారు. నేను కొంత సాధనసామగ్రి సంపాదించుకున్నాను.
ఉపన్యాస ప్రారంభంలో దేవతాభక్తి విశ్వాసాల మీద విశేషత గమనించి "శీతలాదేవికి శ్రీవాహనోన్నతి చెలువొందె నేజాతి కాలము సామి" అన్న పంక్తికి మా సనాతన సభ్యుడొకడు సంతోషాన్ని ప్రకటించటం గమనించాను. గార్దభానికి ఉన్న సత్త్వప్రీతిని, శాంతిరస ప్రణయాన్ని ప్రత్యేకించి వివరించాను. రాసభ, గర్దభ, శబ్దాత్పత్తులు చెప్పి గార్దభానికి గల శబ్ద ప్రాధాన్యాన్ని ఉటంకించటం కొంత రక్తి కట్టింది. త్రిభువన భాండ నిర్మాణానికి కులాలుడు, మృత్తికలతో బాటుగా గార్దభము సహాయ కారణమైంది అన్న నా వాదం విన్నమీదట, ఒక తార్కిక శిరోమణి ఇది గొప్ప విషయమన్నట్లు నేత్రాలను విస్ఫారితం చేశాడు. విధాతృని ప్రధాననిర్మాణాలలో ఒకటి కావటం చేత శబ్ద ప్రధానము, సత్త్వ విస్ఫురితము అయిన రాసభము, పరిశుద్ధులకు గాని పట్టుబడనని అభివ్యక్తం చేయటం కోసము నేడు రజకుల నాశ్రయిస్తున్నది అన్న అంశం ఒక వర్గంవారికి మనోరంజకమైందన్న విషయాన్ని గమనించాను. ఉన్నదో, లేదో వేదంలో గర్దభప్రశస్తి కనిపిస్తున్నదన్న నా బుకాయింపు రాసభానికి శబ్ద ప్రామాణ్యాన్ని చేకూర్చటమే కాక కొంత వైశిష్ట్యాన్ని చేకూర్చింది.
"గంగి గోవుపాలు గరిటడైనను చాలు, కడివెడైన నేమి ఖరము పాలు?” అని నేమన్న తిరస్కార పూర్వకంగా ఏ దృష్టితో అన్నాడో గాని, ఖరము పాలు కడివెడు లభించటమంటే సామాన్యమా? ఖరము పాల ఘనత సర్వసన్యాసి వేమన్నకేం తెలుసు? కాని సౌందర్యపోషకాలున్న సంవర్ధకమైన ఖరక్షీరాన్ని స్నానద్రోణులతో నింపుకొని స్నానమాడి జగదేక సుందరిగా రూపొందిన క్లియోపాత్రా నడిగితే తెలుస్తుంది. ఈ సందర్భంలో గాడిదను పాలిచ్చి పొమ్మని తల్లి జోల పాట పాడటం, "పాటిమీద