ఇది బుద్ధిమంతులైన జనులకు నేను చెప్పుతున్నాను" అని గోజాతి మీద ఋగ్వేద కవి ప్రకటించిన అభిమానాన్ని ఏ కవీ ఎన్నడూ ప్రకటించినట్లు కనిపించదు.
సర్వజననిరాదరణ వల్ల వస్త్రభారవహనం, కుగ్రాసము లక్షణాలైనందు వల్ల కూడా గార్దభం పరిహాసపాత్రమైంది. లేకపోతే అన్యాపదేశంగానైనా ఒక కవి -
“రేరే రాసభ! వస్త్రభారవహనాత్ కుగ్రాస మశ్నాసి కిం రాజాశ్వావసథం ప్రయాహి చణకా బ్యూషాన్సుఖం భక్షయ | సర్వాన్ పుచ్ఛవతో హయా ఇతి వదం తృత్రాధికారే స్థితాః రాజా తై రుపదిష్టమేవ మనుతే సత్యం తటస్థాః పరే ॥”
ఓ రాసభమా! వస్త్రభారాన్ని వహిస్తూ ఈ చెడుతిండి తినటమెందుకు? రాజాశ్వశాలకు పోయి సుఖంగా సెనగలను భక్షించు. అచటి అశ్వాధిపతులు పుచ్చవంతాలన్నింటినీ హయాలనే అంటారు. రాజు వారి మాటలనే విశ్వసిస్తాడు. ఇతరులు తటస్థులుగా ఉంటారు. (నీకు ఏ భయమూ ఉండదు. దేశ ద్రిమ్మరితనం వల్ల నొప్పితో ఎప్పుడో కాళ్ళీడుస్తుంటే చూచినవాడల్లా అడ్డకాళ్ళ పెద్దమ్మలను గాడిద కాళ్ళవాడన్నాడు. 'గాడిద చెవులు' అన్న జాతీయం కూడా ఇలాంటిదే. త్రిస్థాయి సంగీతాన్ని వినిపించటంలో దివ్యశక్తి గల గార్దభాన్ని పట్టుకొని 'గాడిద చెవులు' అనటం కేవలం అన్యాయం! పాశ్చాత్యలోకంలో కూడా గార్దభ శ్రవణశక్తిని గురించిన ఈ అపోహ ఎందుకో కలిగింది. తాను పట్టుకొన్నదల్లా బంగారమయ్యే వరాన్ని పొంది, అత్యాశ చేత తన చుట్టూ ఉన్న సర్వస్వాన్ని స్వర్ణం చేసి, ఆకలితో అలమటించిన 'మైదాస్' రాజులు ఇతనికీ, 'పాన్' అనే సస్యదేవతకూ జరిగిన సంగీతం పోటీలో విజయాన్ని 'పాన్'కు కట్టబెట్టడం కోసం ఇతని చెవులను గార్దభాశ్రవస్సులుగా మార్చినట్లు కనిపించడం ఇందుకు తార్కాణం.) ఉత్సాహరాహిత్యానికి, మాంద్యానికి, మంకు పట్టుకు, మర్యాదావిహీనతకు సంకేతమైపాశ్చాత్య దేశాలలోను గార్దభం గౌరవప్రతిష్ఠలను ఏ కాలంలోనైనా ఆర్జించుకున్నట్లు కనుపించదు.
రూపరేఖల్లోగాని, బుద్ధివర్తనలలో గాని లోకంలో ఇంత వ్యతిరేకత ఉన్న గార్దభ జాతి సముద్ధరణకు స్థిరసంకల్పుండనైన నాకు "క్రియాసిద్ధిస్సత్త్వే భవతి మహతాం నోపకరణా" మహాత్ములకు పని నెఱవేరటం ప్రభావం వల్ల కలుగుతున్నది. ఉపకరణాల వల్ల కాదు. అమంత్ర మక్షరం నాస్తి నాస్తి మౌషధం. అయోగ్యః 'పురుషోనాస్తి యోజక స్తత్ర దుర్లభః - మంత్రం కాని అక్షరం లేదు, ఔషధం గాని మూలిక లేదు.