పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/842

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెంటనే నేను “ఖరా” అన్నాను. "ఖం ముఖాంతర్వర్తి మహదాకాశ మేషా మస్తీతి ఖరాః” - ముఖంలో గొప్ప బయళ్ళు కలవన్న నా శబ్దార్థాన్ని గమనించి, పెద్దనోళ్ళు ఉండటం చేత ముఖంలో గొప్ప బయళ్ళు ఏర్పడటం మానవ జంతువుల్లో కొన్నిటికి లక్షణమై ఉండటం మీరు గమనించే ఉంటారన్నవి మరికొన్ని. ఇంతలో మొఱ పెట్టినట్లుగా ఒక చక్రీవంతం ఓండ్ర పెట్టింది. నేను “గర్దభాః' రాసభాః - రాసంతే ఉచ్చైరితి రాసభాః గర్దంత్యుచ్చైరితి గర్దభాః" - బిట్టు మొఱపెట్టేవి అన్నాను. మహారణ్యాల్లో మహనీయ స్వేచ్ఛాసంచారం చేస్తూ మనోజ్ఞమైన జీవనం చేస్తున్న మమ్మల్ని మచ్చిక చేసుకొని ఆశలు ప్రేరేపించి తెచ్చి తమ మధ్యకు తెచ్చి మా వల్ల పొందదగ్గ మహోపకారాలన్నీ పొంది, ఇంకా కొన్నిటినీ పొందుతూ కూడా చిత్తచాంచల్యంతో, గజ హయాదులకు గౌరవ స్థానమిచ్చి మనస్సు మార్చుకొన్న మీ మనుష్య జంతువు తెచ్చిపెట్టిన తీరని దుఃస్థితికి శోకించి శోకించి మా కంఠాలిలా మారిపోయాయి. అన్నాడొక గార్దభ నేత.

మహాసభకు ముందు ఈ రాసభాదర్శన మేమిటని ఒక వంక కలవరం పొందుతూనే “ఇలా నన్ను చూడరావటంలో మీ ఉద్దేశ మేమి" టన్నాను సౌజన్యంతో. “మీ పతిత జనోద్ధరణ సంఘ దృష్టిని మా గార్ధభ జాతి సముద్ధరణం మీద కేంద్రీకరించవలసిందని అభ్యర్థించటానికి ఇలా సమూహంగా వచ్చాము. మాది పతిత జనోద్ధారణ సంఘం గదా! మీరు జంతువులు కదా ఇది ఎలా కుదురుతుందనుకోవద్దు. మనుష్యులు ఎంతటి జంతువులో మేమూ అంతటి 'జనులము.' జంతు శబ్దం మీకు కూడా రూఢమైనట్లు జన శబ్దాన్ని మాకు కూడా మీ సంఘ భవిష్యత్కార్యక్రమం ద్వారా రూఢం చెయ్యండి. మా పూర్వోన్నతిని, నేటి దుఃస్థితిని భావించి సమర్థించగల సామర్థ్యం మీకున్నదని మా గాఢ విశ్వాసం" అన్నాడు గార్దభ నేత. రాసభాలన్నీ ఐక్యకంఠంతో నాకు జయపెట్టినట్లు ఓండ్రపెట్టాయి. సెలవు తీసుకొంటున్నట్లు ఉన్నమిత పుచ్ఛాగ్రచాలనం చేసి కోలాహల ధ్వనులతో గార్దభాలన్నీ తిరోగమించాయి.

సద్దుకు మెలకువ వచ్చి శయ్యపై కూర్చున్నాను. ఆలోచన ప్రారంభమైంది. జన శబ్దాన్ని జంతుపరంగా అన్వయించవచ్చా? తప్పేముంది? శబ్దవేత్త లంగీకరిస్తారు. లోకం అంగీకరిస్తుందా? లోకం క్రొత్త మాటలను ఎన్నిటిని అంగీకరించటం లేదు; ఎన్ని శబ్దాలకు క్రొత్త అర్థాలను కల్పించుకోవటం లేదు? ఏమైనా సరే 'జన' శబ్దాన్ని ‘జంతు’ పరంగా అన్వయించి మా పతిత జనోద్ధరణ సంఘదృష్టిని గార్దభ జనసముద్ధణకే కేంద్రీకృతం చేయాలని నిశ్చయించాను.