Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/841

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రశస్త రాసభము

మహాసభ కార్యక్రమం అనంతంగా ఉంది, మళ్ళీ నిద్రకు అవకాశం దొరుకుతుందో లేదో, అది “చిత్తం ప్రసాదయతి, జీవన మాదధాతి, ప్రత్యంగ ముజ్వులయతి ప్రతిభావిశేషం” ఇత్యాదిగా ప్రశస్తి గన్నది అని నిశ్చయించాను. దిజ్మాత్రంగా ఆంజనేయ దండకాన్ని అరక్షణంలో మానసికంగా తిరగవేసి మైరేయ మాదకత్వంతో మేను శయ్యమీద వాల్చాను. అది జాగ్రదవస్థో' స్వప్నావస్థో చెప్పలేను. నలుదిక్కులను నల్లని పొగలు క్రమ్ముకోవచ్చి నా కళ్ళముందు కారుచీకట్లు ఆవరించాయి. ఆ అంధకార మధ్యాన్ని చీల్చుకొని వచ్చి ఓ చిక్కని కుచ్చుతోక ముచ్చటగా ముమ్మారు ఆడి నిలిచింది. ఏ ఉచ్చైశ్రవ దర్శనమో అవుతుంది. “మా పతిత జనోద్ధరణ సంఘాని"కి శుభపరంపరలు రానున్నవని మహానందపడుతున్నాను. పతిత జనోద్ధరణ పేరుతో హంగామాలు చేసి వత్రికాముఖంగా ప్రచారాన్ని సంపాదించి పైకి రాదలచుకున్న వాళ్ళుగాని, అందుమూలంగా అర్ధకామాల ఆకలి తీర్చుకోదలచుకొన్న వాళ్ళుగాని మా సంఘంలో సభ్యులుగా మచ్చుకైనా ఒక్కరూ లేరు. అందు స్వార్ధరహితులు కేవల కరుణాపరులు. దీనజనుల దుఃస్థితికి వసివాడి మనోవాక్కాయ కర్మలా వారిని ఉద్ధరించవలెననే అపేక్ష అతిశయంగా ఉన్నవాళ్ళు. అందుకు తమ శక్తిసామర్థ్యాలు ధారవోయటానికి సర్వసంసిద్ధులైనవాళ్ళు.

అపూర్వ దృశ్యంగా నా ముందు నిలచిన పృచ్ఛం లీలాప్రాయంగా రెండుమూడు చాలనాలను చేసి ఒక చక్రభ్రమణం చేసే స్ఫూర్తి చూపించేటప్పటికల్లా విచిత్ర భారీ కర్కశరాగ స్వరాలతో హారాలతో మూర్తిగొన్న కరుణగా నా మీద ఒక చతుష్పాత్తు నిలిచింది. నెమ్మదిగా దాని వెనక తుల్య సత్వరూపరేఖలతో అదే జాతి జంతువులు చిన్నవీ, పెద్దవీ కొన్ని గుంపు చేరి నిలిచాయి.

అప్రయత్నంగా నా నోట్లో నుంచి “చక్రీవంతః" అన్నమాట వెలువడింది. “చక్రం సమూహహస్తద్వంతః చక్రీవంతః" గుంపై ఉండేవి అన్నాను, చదువుకున్ననాటి సంస్కారంతో. జగత్సౄష్టిలో చక్రీవంతాలు కాని జంతువు లేమున్నవి, మనుష్య జంతువులు చక్రీవంతాలు కావా? అన్నవి ఆ గుంపులో కొన్ని పెద్ద నోళ్ళు విప్పి. ____________________________________________________________________________________________________

ఇతర వ్యాసాలు

841