Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/838

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


'విన్న విషయాల్లో ఎక్కువ భాగం నమ్మకు. నమ్మినవాటిలో అతి స్వల్పాలు గాని సత్యాలు కావు' అని పూర్వం ఓ గురువర్యుడు శిష్యునికి బోధించాడట. ఇది నగ్న సత్యం. 'కబుర్లరాయని' 'జిహ్వాతూలిక' చిత్రించిన ఓ 'సహస్ర ప్రియ' సత్యానికి 'ప్రియవిరహ, కావచ్చును. అతడు 'ప్రియారహితగా' చూపించిన కురూపిని వేయిమంది ప్రేమించనూ వచ్చు, లోకంలో సత్యాలకూ కులాసా కబుర్లలోని సత్యాలకూ ఇంత అంతరముంటుంది.

కబుర్లకు అపప్రథలూ, అపకీర్తులూ, అసత్యాలూ తాబేదార్లు. వీటికి ప్రచారం కల్పించే వాళ్ళు కులాసా కబుర్ల రాయుళ్ళు. కులాసా కబుర్లలో వ్యక్తులమీద గానీ, వస్తువుల మీదగానీ ఉండే ఈర్ష్య, క్రోధం, వైరం, వలపూ ఇత్యాదులు వ్యక్తమౌతూ ఉంటవి. ఈ సహజావ బోధలకు కళ్ళాలు వేసి లొంగ దీసుకున్న వ్యక్తులు ఇటువంటి వాటిలో పాల్గొనరు. అథవా ఏ కారణం చేతనైనా ఆ దుస్థితి సంభవిస్తే మానసికంగానైనా హర్షించరు. సాధ్యమైనంత త్వరలో కులాసా కబుర్లరాయుని ఆస్థానమనే 'బలిపీఠం’ దగ్గరినుంచీ బయటపడే యత్నం చేస్తారు. అయినా ఎంత మోతుబరి పెద్ద మనుషులకైనా, జీవితాని కొకమాటే కావచ్చును. ఇటువంటి కబుర్ల 'గోష్ఠి'లో చేరటం తప్పటం లేదు. దానికి అన్నివైపులా అలముకొని ఉన్న వాతావరణ కారణం. అందులో కొందరు భాగస్వాములై క్రమంగా ఏదో లాభం ఒలికి పోతుందని, అటు తరువాత బయటపడలేక పోవటమూ జరుగుతుంటుంది.

‘అసత్యకథాకల్పనం చేసేవాళ్ళు నీచులు; వాటిని ప్రచారం చేసేవాళ్ళు నీచాతినీచులు, అన్నారు పెద్దలు. కులాసా కబుర్ల రాయుళ్ళలో ఎక్కువ భాగం ఇటువంటివారే. ఎప్పుడైనా యిటువంటి కులాసా కబుర్లకు మనమే గురి అయినామని గ్రహించిన పెద్ద మనుషులు పట్టించుకోనట్లు ఓ చిరునవ్వు విసిరేస్తుంటారు. అంతకంటే ఉదాత్తులు “నా మీద అసత్య ప్రకటన చేసినందుకు నాకు బాధలేదు; కానీ 'సంతసంబగును కల్గన్ భుక్తి అవ్వానికిన్" అంటారు. జిజ్ఞాసువులు 'అయ్యో! పాప' మని వాళ్ళ దైన్య స్థితికి నిట్టూరుస్తారు. కులాసా కబుర్లు చెప్పేవాళ్ళు ఆత్మశక్తిని గానీ, స్వభావాన్ని గానీ గ్రహింపలేనివారేమా? - అని వారి చింత. వీరి మాటలవల్ల కలిగే ప్రయోజనము బహుస్వల్పంగా ఉంటుంది; దానికి లెక్క జేసి వారితో మైత్రినాశించవలసినంత అవసరం లేదు. వారి ప్రచారం వల్ల సంభవించే నష్టానికి భయపడవలసిన పని కూడా ఉండదు. పొరపాటున అటువంటి స్థితి సంభవించిన వ్యక్తికి దైహిక, మానసికారోగ్యాలు క్రమక్రమంగా లుప్తమైపోతూ ఉంటవి. 'సత్‌శీల

838

వావిలాల సోమయాజులు సాహిత్యం-4