ఉండటమున్నూ, చెప్పేవాడు బట్టతలలకూ, మోకాళ్ళకూ ముడి పెట్టుతున్నా ముచ్చటపడి
విని మురిసిపోవటమున్నూ. విశేషంగా మానవజాతిలో ఉన్న ఈ దౌర్బల్యం
గమనించటం వల్ల కబుర్ల రాయుళ్ళు జైత్రయాత్ర సాగిస్తున్నారు. లోకాలను
జయిస్తున్నారు. వారు చెప్పేమాటలు, 'గగన కుసుమాలనీ' అజాగళస్తనాలనీ,
నేతిబీరకాయలనీ గ్రహించినా ఏమీ వెరపు లేదు. అతడు 'ప్రియ వాది'. 'అప్రియస్య
చ పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః!' అన్న ఆర్యోక్తిని తెలుసుకోకపోయినా సారాంశాన్ని
గ్రహించి వ్యవహరించటం అతని లక్షణం.
కబుర్ల రాయుడు లోకం సమస్తం అతనికి అవగతమైనట్లే మాట్లాడుతుంటాడు. అతడి 'అనర్గళ వాగ్ధోరణీ సారణాల్లో అనేకులు మహాపురుషులూ, మహాత్ములూ ‘ఖూనీ' అవుతుంటారు. 'అందుమూలంగా అతను 'ఆత్మహత్య చేసుకుంటున్నాడన్నమాట' అని తాత్వికులంటేనేం? ప్రసిద్ధి పొందినవాళ్ళమీద ఇతని 'వాగ్బాణాలు' పడ్డా పరవాలేదు. ఇటువంటి 'గరుడాస్త్రాలకు' నాగాస్త్ర ప్రయోగం చెయ్యగలిగిన 'నరనారాయణులు' వాళ్ళు. ఇంకా పేరు ప్రఖ్యాతులు ఎరగని వాళ్ళమీద 'కబుర్ల రాయుళ్ళు' విసిరే 'అంపగమి'కి ఉక్కిరి బిక్కిరై పోతుంటారు. అందుకనే ఓ ప్రఖ్యాత రచయిత వీరిని 'అగ్నితుల్యు' లన్నాడు. అగ్ని 'తనూనపాత్తు' - పుట్టిన దేహమంతా తానే ఐ ఉంటాడట. వీరూ అంతే - నిలువునా 'ఖుషీ' ఉంటుంది. దాన్ని కబుర్ల రూపాన లోకంలో వెలిబుచ్చి 'అశుచీక్షణు' లౌతుంటారు. అగ్నికి నల్లని జాడ అంటి ఉంటుంది - అందువల్ల ఆయన కృష్ణ వర్త్మ ఐనాడు; వీరూ కృష్ణవర్త్మలే - వీరిని అపకీర్తి వెన్నాడుతుంటుంది. ఆయనవలె వ్యక్తులను 'పరశురామ ప్రీతి' చేసే శక్తి వీరికి లేదు గాని దాహకులు.
ప్రఖ్యాతులైన వ్యక్తుల మీదుగానో, ఇరుగు పొరుగు గృహస్థుల మీదుగానో కబుర్ల కమనీయ జిహ్వారథం నడుస్తుంది. అవహేళన అతని రథానికి కట్టిన అశ్వం. దాని కాంతీ, సటాచ్ఛటలూ, హేషితాలూ శ్రోతలను ఆకర్షిస్తవి. ఈ ఆకృష్టులైన వ్యక్తులకు కబుర్ల రాయని జిహ్వాజగన్నాథ రథ చక్రాల క్రింద నలిగిపోతున్న ప్రఖ్యాతుల ప్రజ్ఞా ప్రతిష్ఠలు గానీ, సామాన్య గృహస్థుల సమతా సౌమనస్యాలుగానీ ఎన్నడూ అర్థం కావు; అయితే వారికి బాధలేదు, ఆ ప్రయత్నమేలేదు గనక. వీరు 'జిహ్వా గ్రే వర్తతే లక్ష్మీ, జిహ్వాగ్రే మిత్ర బాంధవా' అన్న ప్రమాణానికి విపరీతార్థాన్ని కల్పించే శక్తిగల ‘కబుర్ల రాయని' 'గారాబు శిష్యులు'. వీరి గురువర్యుడు 'సర్వజ్ఞుడు.' ఆయన లోకం సమస్తాన్నీ ఆకళించుకొన్న అఖిలజ్ఞుని వలె ప్రసంగిస్తాడు, ప్రవర్తిస్తాడు. అది సాహసమని గానీ, సత్యేతరమని గానీ అతడెరగడు. అతనిది దివాంధ దృష్టి.
ఇతర వ్యాసాలు
837