Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


దగ్గించుకొనుట వలనఁ జర్మవ్యాధులు, శరీర దౌర్బల్యము, మనోమాంద్యము కలుగునని వారందురు.

పరిశోధింపఁ దగిన యంశములలో నిద్ర నతి ప్రముఖమైన దానినిగ శాస్త్రజ్ఞులు పరిగణించినారు. వారు కడుశ్రద్ధతోఁ బరిశోధనలు సాగించుచున్నారు. నిద్రను గూర్చిన యే యొక యంశమునైన 'నిది నిర్ణయ' మని చెప్ప వీలుకల్గక పోవుటచేఁ జమత్కారగర్భితముగ నొక శాస్త్రజ్ఞుఁడు "నిద్రనుగూర్చిన మా పరిశోధనల సారాంశము రాత్రి శయనించుట, యుదయము మేల్కొనుట" యని యభిప్రాయ మిచ్చినాఁడు.

107[1]నెబ్రాస్కా విశ్వవిద్యాలయమునందలి వైద్యకళాశాలలో, జహార్ అను నాచార్యుఁడు నిద్రను గూర్చి దీర్ఘ పరిశోధన లొనర్చి కొన్ని విశేషాంశములఁ బ్రకటించి యున్నాఁడు. ఆధునిక ప్రపంచమున నిద్ర పట్టనివారు విశేషముగ నున్నారు. వారు రెండు తెగలవారు. శాంతియుతమైన నిద్ర కావలయునని కోరుకొనుచు నిద్రాసమయమును దప్పించుకొని పిమ్మట బాధపడువారు మొదటి తెగవారు. వ్యాధిగ్రస్తులు రెండవ తెగవారు. వయసు మరలినవారికి నిద్రపట్టక పోవుటకుఁ గారణము చిన్నతనమున వారిని తల్లిదండ్రులు బలవంతముగ నిద్రపుచ్చుటయే యని యొక యభిప్రాయము. నిద్ర కొఱకను నుద్దేశముతో మనస్సును గాని, శరీరమును గాని శిక్షింపయత్నించుట మంచిది కాదు.

"జంతువులు త్వరితముగ మృతినొందుటకుఁ గ్రమమైన నిద్ర లేకుండుటయే గారణము. కళాశాల విద్యార్థులు ముప్పది యెనిమిది మారులు, మధ్యమ వయస్సు గలవా రేబది మూఁడు మాఱులు నిద్రలోఁ గదిలెదరు" - ఇవి జహార్ అను శాస్త్రజ్ఞుని పరిశోధనమువలనఁ దేలిన కొన్ని యంశములు.

"శయ్యమీఁదఁ జేరి సున్నితముగ సుఖనిద్ర నొందుటకంటె నదృష్టవంతులకు వేడొక శుభలక్షణము లే' దాని యొక తాత్వికుఁడనినాఁడు. అలసిపోయిన యవయవములు కష్టపడుట కిచ్చగింప నపుడు క్రమముగా విశ్రాంతినొందు యత్న మారంభించును. తొలుదొల్త ఘ్రాణశక్తి, తరువాత రసన, పిమ్మట క్రమముగ స్పర్శజ్ఞానము, శబ్దగ్రహణశక్తి తప్పిన పిమ్మట మనస్సు వ్యవహరించుట మానివైచును. జోషువా రోసెట్ అను విజ్ఞాని "నిద్రారంభదశలో నిత్య జీవితము నందలి కొన్ని విశేషాంశములు జ్ఞప్తికి వచ్చుట, పిమ్మటఁ గొన్ని మధురములైన కోర్కెలు జన్మించుట, యటుతరువాత సుఖాభిలాషలు కలుగుట, భ్రమలు కొన్ని పుట్టి తదుపరి నిదురమంపు,

స్వప్నావస్థ యేర్పడు' నని నిరూపించినాఁడు.
  1. 107. నెబ్రాస్కా అమెరికా సంయుక్త రాష్ట్రములలో నొకటి. లింకన్ దీని ముఖ్య నగరము

____________________________________________________________________________________________________

64

వావిలాల సోమయాజులు సాహిత్యం-4