Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


దీర్ఘ నిద్రఁగలవానిఁ జూచి కుంభకర్ణుఁ డను బిరుదమును బ్రసాదించుట పరిపాటి. కుంభకర్ణుఁడు లంక కంపించు నంతటి కోలాహల మొనర్చినఁ గాని మేల్కొనెడివాఁడు కాఁడఁట! పురాణ స్త్రీ లోకమున నూర్మిళాదేవి నిద్రలో నుత్తమశ్రేణి గడించుకొనినది. పౌరాణిక వ్యక్తుల మాట దూరముగ నుంచి చారిత్రక కాలమునకు వత్తము. సుప్రసిద్ధుఁడగు గ్రీకు చరిత్రకారుఁడు 102[1]హెరడోటస్ తా నారుమాసములు నిద్ర మేల్కొని యారుమాసములు నిదురించు జాతులఁ జూచినట్లు రచనలలోఁ బేర్కొనినాఁడు. ఇది సత్యమో! మఱి యసత్యమో!!

కొలఁది కాలము క్రిందట 'అన్నా స్వాన్ పోవెల్' అను అమెరికా దేశస్థురాలు భర్త మరణవార్త వినిన వెను వెంటనే నిద్రావస్థ నొంది, ముప్పది యొక్క సంవత్సరములు గడచిన తఱువాత మేల్కొనినట్లు వార్తాపత్రికలఁ బ్రకటితమైనది. ఇది యభూతకల్పన మనుటకు వీలులేదు. ఇట్టి విచిత్రములు సకృత్తుగనైనఁ గొన్ని బ్రపంచమున జరుగుచునేయున్నవి.

జంతుకోటికి దీర్ఘనిద్ర యొక విశేషగుణము. వానికది సహజావబోధము. ‘ఆకులపాటు’ ప్రారంభము కాఁగా నాస్ట్రేలియాలోని ఒప్పోజం, డింగో, యాంటీటరు వంటి జంతువులు, కొన్ని సర్పజాతులు, క్రిమికీటకములు దీర్ఘనిద్రకు సిద్ధపడుచుండును. ప్రతి సంవత్సరము నిది తప్పదు. ఎవరో ప్రబోధించి నట్లాపని కాయా ప్రాణికోటులు పూనుకొనును. ఈ దీర్ఘనిద్ర యందొక వైచిత్రి యున్నది. ప్రాణుల యవయవములన్నియు నొకమారుగ నిద్రావస్థ నొందవు. ఒక క్రమము ననుసరించి యొక్కొక్క యవయవమే నిద్ర నొందును. కొన్ని యవయవములు నిద్రించుచున్నప్పుడు మేల్కొనిన నన్యావయవములు మత్తుపదార్థమును జేకూర్చుకొనుచుఁ గొంతకాలము బహుభారముతో జీవయాత్ర సాగించుచుఁ గన్పించును. ఈ స్థితిలో వాని శరీరోష్ణత యర్థమగును.

దీర్ఘ నిద్ర నొందుచున్న దివాంధమును నీట ముంచినను, జుంచును జావ మోదినను మేల్కొనవఁట! 'మొంబా' జాతి సర్పము జాగ్రదావస్థలో నతి భయంకరమైనది. 'లాన్సుకోలమ్' అను శాస్త్రజ్ఞుఁ డది దీర్ఘనిద్రయం దున్నప్పుడు మేల్కొల్ప "నన్ను నిద్రింప" నిమ్మని బతిమాలుకొనినట్లుగఁ బ్రవర్తించినదఁట! ఎలుఁగుబంట్లు కొన్ని ప్రదేశములం దిట్టి దీర్ఘనిద్రావస్థలోనే ప్రసవించి మేల్కొనిన పిమ్మట రెండు మూఁడు నెలల వయస్సుగల బిడ్డలతో నాడుకొనును. ఈజిప్టుదేశమునందలి నత్త లైదారేండ్లు

నిదురించు చుండునఁట! అందముగనున్న యొక నత్తగుల్లను దెచ్చి బ్రిటిష్ వస్తు
  1. 102. హెరడోటస్ (క్రీ.పూ. 484 - 424) గ్రీకు చరిత్రకారుఁడు. ఆసియా మైనరులోని కపడోసియాలో జన్మము. గ్రీకులకును పారశీకులకును జరిగిన యుద్ధమును తొమ్మిది సంపుటముల చరిత్రగ అయోనిక్ మాండలిక భాషయందు వ్రాసినాఁడు. ఇతని చరిత్ర ప్రాచీన చరిత్రకొక యుత్తమ సాధనము

____________________________________________________________________________________________________

మణిప్రవాళము

61