Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది



మొనర్చును; అవయవములు కౌజ్వల్యము సేకూర్చును, శరీర దోషములను రూపుమాపును. ధాతువులను సుస్థితిలో నిల్పును. యోగ గమ్యమైన యానందమును బ్రసాదించును” అని యీ విద్వద్వరేణ్యుని సూక్తి.

నిద్రాశబ్దార్థమే యీ యర్థమును నిరూపించుచున్నది. 'నియతం ద్రాన్తి ఇంద్రియా ణ్యత్రేతినిద్రా' ఇంద్రియములు నియతముగ దీనియం దంతరితములై యుండుటచే నిద్ర నిద్రయైనది. దీని కొక రీతిగఁ బర్యాయపదము లైన స్వప్న సంవేశనములకును నర్థమిదియే.

శ్రీనాథ మహాకవి [1] కంటికి నిద్ర వచ్చునె.... జిహ్వకు న్వంటక మిచ్చగించునే... శాత్రవుఁడొకఁడు తనంతటి వాఁడు కల్గినన్" అని స్వర్ణ నగౌద్ధత్యమును సహింపఁజాలని వింధ్య పర్వతముచేఁ బలికించినాఁడు. ఈర్ష్య నిద్రాభంగకారణము. అంతియ కాదు. [2]'అలుక యెత్తిన వానికి, నర్థచింతకునకు, నాతురునకుఁ గామ గోచరాత్మకునకును వచ్చునే? ఎన్నఁబడి జనులెఱింగిన యిన్నాలుఁగు తెఱఁగులందు నెయ్యది. యైన న్గను మొగుడ నీదటె నా కిన్నియుఁ గలుగంగ నిద్ర యేటికి వచ్చున్' అని కవిబ్రహ్మ తిక్కన సోమయాజి సౌప్తికవధోద్యోగ పూర్వరంగమున వికలమానసుఁడైయున్న యశ్వత్థామచేఁ బలికించినాఁడు. - నిద్రాభావమున కివి కొన్ని కారణములు. కోపి పగ సాధించుకోర్కెతో నిద్రం జెందఁడు. శత్రు నిరాసక్రియా మార్గాన్వేషణమున మనసు లగ్నమై యుండుట వలనను నిద్ర కలుగక పోవచ్చును. అర్థచింతకుని యాలోచనాతత్పరత నిద్రాశూన్యునిఁ గావించుచున్నది. ఆతురునకుఁ గామగోచరునకు శరీర స్వ్యావస్థా భేదాదులవలన నిద్రరాదు.

నిద్ర కలుగక పోవుటకుఁగల కారణములు స్వాస్థ్య, శారీరక, మానసికము లని త్రివిధములుగ వైద్యశాస్త్రజ్ఞులు నిర్ణయించినారు. శరీరమునందు 'బ్రొమైన్' అను పదార్థము తక్కువగుటవలన నిద్రకు భంగము కలుగుననియు నది ప్రత్యేకముగ నొక వ్యాధి కాదనియు, నొక వ్యాధికి బాహ్యచిహ్నమనియు జోన్ డక్ వంటి విజ్ఞుల యభిప్రాయము. 'నిద్ర మన కెందులకుఁ గల్గుట లేదను నాలోచనతో నిద్రాసమయమును బోఁగొట్టుకొని పిమ్మట రేయెల్లయు జాగరణ మొనర్చువారు నేఁటి ప్రపంచమునఁ బెక్కు రున్నా రని యిటీవల నొక శాస్త్రజ్ఞుఁడు పత్రికాముఖమునఁ

బ్రకటించినాఁడు.
  1. కాశీఖండము ఆ. 1, ప. 108
  2. భారతము సౌప్తికపర్వము ఆ.1

____________________________________________________________________________________________________

60

వావిలాల సోమయాజులు సాహిత్యం-4