Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


“మున్ముందామెకు ముకుపుటమ్ములఁ బుష్పాసవ మొఁసగి సేదఁదీర్చెదరు. భర్త కళేబరమును శరీరము నుండి తొలగించి యామెచే మంగళస్నానముఁ జేయింతురు. అటు పిమ్మట రాజ్ఞి వారందఱతోఁ “బునఃసృష్టి నారంభించి మఱియొక మధుకోశ రాష్ట్రమును నేఁ బరిపాలింతు" నని ప్రకటించును. మఱుక్షణము నుండి పరివారము నిమేషమైనఁ గాలహరణ మొనర్పక వనములెల్లఁ దిరిగివచ్చి మధూచ్ఛిష్టముతో నొక కోశమును నిర్మింతురు. రాజ్ఞి యందుఁ దన కక్ష్యను జేరియండముల నిడుచుఁ జంచరీకసృష్టికిఁ బూనుకొని నాల్గుశరత్తులు జీవించి పాలించును.”

భ్రమర జీవిత మీ రీతిగ నా జిజ్ఞాసువు విన్పింపఁ జెవియొగ్గి వింటిని. కాని నా బుద్ధి యీ కథనము నందలి సత్యాసత్యములఁ గూర్చి యోజింపలేదు. నా మానసమున ననంత భావబంభరములు తిరిగియాడ నారంభించినవి.

అవి : 'పూలకడుపునఁ దేనియఁబోసె నెవఁడొ దానిఁ తీయు నేర్పు తుమ్మెదలకు లభిం. ఇందుకుఁ గారణము పుష్ప కోమలులకు భ్రమర యువకులపైఁ గల ప్రణయమేనా? భ్రమర కులప్రణయము లోకమున 'షట్పదప్రణయ' మని పరిహాసపాత్ర మగుచున్నది. 'నెమ్మదికి రావె యీ తుమ్మెదకు నో వూవ! అమ్ముకోఁబోకె నీ నెమ్మనము నో పూవ!' యని వనపురంధ్రీమణు లెంతగఁ జెప్పినను బాటింపక :

చ. 92[1]"ఇది యొక కన్నెపూవు హృదయేశ! మధూదయవేళ నేరికి
     న్ముదము దలిర్పఁగా మనసు మ్రుచ్చిల నీయఁగ లేదు మున్ను నీ
     కొదమతనమ్ముపై ననుఁగు కూరిమిపై నభిమాన ముంచి కో
     విదమధులిట్ప్రభూ! యనుభవింపుము దీని రసప్రలోభివై.”

యని ప్రతికుసుమకన్యయును మందాక్రాంత మధురిమ లొలికింప పాప మా మధుకరకుమారు లే మొనర్పఁగలరు? వారికి దక్షిణ నాయకత్వమును తప్పదేమో యనిపించును. ఈ రహస్య మెఱుఁగని లోక మా దోషమును షట్పద కుమారులపై మోపినది.

భ్రమరయువకులు పరార్థతత్పరులు.

ఉ. 93[2]"హ్రస్వతరమ్ము జీవము రహసృష దీర్ఘతరమ్ము నైన యీ
     నశ్వరమైన జీవితమునన్ క్షణమొక్క యుగమ్ము కాఁగ స
     ప్తస్వర మాతృకాయిత భవన్మృదుగాన సుధాప్రవాహ స
     ర్వస్వము నారగించు ప్రబలత్వర నుంటిని నీకునై ప్రియా!”

యని యాక్రోశించు ప్రసవములఁ గాదను టెట్లు పొసఁగును?

  1. 92. ఇది యొక కన్నెపూవు - మదీయము
  2. 93. హ్రస్వతరమ్ము - శ్రీ పాటిబండ మాధవశర్మ "మధువ్రత” నుండి

____________________________________________________________________________________________________

మణిప్రవాళము

55