పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


“మహాత్మా! నాకు మధుకరము లన్న మహాభిమానము. మనసు గొని బహువనములఁ బర్యటించి వాని జీవిత విశేషముల సేకరించుకొనుచున్నాఁడ”నని వినయపూర్వకముగఁ బల్కితిని. అంత నా మహాత్ముఁడు 'నాయనా! రమ్ము. నేనును నీవలెనే బంభరాభిమానమును జేకొని పరమప్రీతితోఁ బుష్పవనములఁదిరిగి తిరిగి షట్పద జీవితచరిత్ర నాఁకళించుకొన యత్నించితి" నని యాదరాభిమానములతో నన్నాహ్వానించినాఁడు. భక్తి తాత్పర్యములతో నే నా యనుభవజ్ఞుని వేడుకొని నంత నతఁడు భ్రమరజీవితచరిత్ర నిట్లు సంగ్రహస్వరూపమున నిరూపించినాఁడు.

"ప్రతిమధుకోశము నొక భ్రమరమహాసామ్రాజ్యము, ఇవి మాతృస్వామిక రాజ్యములు. దీనిని బాలించునది మహారాజ్ఞి. అన్యభ్రమరము లామె కొల్వున్న వేళల 'జయ! మధు కోశోద్ధత్రీ! జయ! ఉన్మదమధుగణహంత్రీ!! జయ! అళిలోక సృష్టి' యని నిత్యకైవారము లొనర్చుచుందురు. పురుషజాతి పుష్పంధయముల కీ రాజ్యమునఁ బ్రాభవము శూన్యము, నిత్యము నవి సుషుప్త్యవస్థ ననుభవించుచుండును. రాజ్ఞి, గర్భవతి యగుట తప్ప వానివలన భ్రమర రాజ్యమునకుఁ గలుగు ప్రయోజన మెద్దియును లేదు. మిగిలినవారందఱుఁ జక్రవర్తినీ పరివారము. వారు స్త్రీలు కారు, పురుషులును కారు...

"భ్రమర రాజ్యమును బాలించు రాజ్ఞి మరణింపఁ దక్షణమే మధుకోశము నుండి యువరాజ్ఞి యొకతె మంగళ మధురఝుంకారముతో బయల్వెడలును.

'అసూర్యం పశ్య' యు 'ననాఘ్రాత పుష్పము' నగు నా నూతన రాజ్ఞ యౌవన సౌందర్యములఁ గనినంతనే యింతకు మున్ను నిద్రాళువులై యున్న పోఁతుటీఁగల ముఖములం దపూర్వోజ్జ్వల వికాసవిలాసములు గోచరించును. రాజ్ఞి మేఘమండల యాత్ర నారంభింప నవియన్నియుఁ దమలోఁ దాము తుముల యుద్ధము లొనర్చుచు నామెను వెంబడించును. ఈ కలహము లందుఁ జిక్కు కొనుచున్న భ్రమరయువకులు బాహుపరిధిలోనికి వచ్చినట్లే వచ్చి రాజ్ఞి తప్పించుకొని పోవుచుండును. రాజ్ఞి యొనర్చుకొను నీ వరపరీక్షయందుఁ దుదకొక భ్రమర యువకుఁడే బ్రతికి బయటఁబడగలడు.

“అతఁడు రాజ్ఞతోఁ గొంతకాలము మేఘమండలమున విహరించిన పిమ్మట రాణి గర్భమును ధరించును. తుద కంబుద మండలమునుండి రాజ్ఞి పతి మృతశరీరముతోఁ దిరిగి వచ్చును. మఱల నామెఁ ప్రజల యందుబాటులోనికి వచ్చినపుడు వారును బరివారమును బొందు నానందమునకు మేర లేదు. ____________________________________________________________________________________________________

54

వావిలాల సోమయాజులు సాహిత్యం-4