Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యా రమణీయ దర్శనముపై నిల్చినది. కొంతకాలమైన పిమ్మట బుద్ధి యా రసిక దాంపత్యమున కత్యామోదము నొందినదయ్యు నిది రసాభాసము కదా యను శంక నొందినది. అప్రయత్నముగ నా యభిప్రాయము నా నోఁటినుండి బయటపడినంత టనుండియో 'రసాభాసమును రసమే' యగు నను నొక కమనీయకంఠము విన్పించినది.

'అది యెచట నుండి?' యని యొక వంకకుఁ జూతునుగదా యట లతా గృహద్వారమున వామప్రకోష్టార్పిత హేమవ్రేతుఁడై ముఖార్పితైకాంగుళి సంజ్ఞచే ‘నల్లరి జేయకుఁ’ డని గణముల శాసించు నందీశ్వరుఁడు నా కంటఁబడినాడు. మఱుక్షణమున వనమంతయు నతని యనుశాసనమున నిష్కంపవృక్షము, నిభృత ద్విరేఫము, మూకాండజము, శాంతమృగ ప్రచారము నైనది. మున్ను పొడకట్టిన ద్వి రేఫప్రియుఁడు ప్రియావియోగము నొంది యొంటిగ నొక యామ్రశాఖికపై నిలచియున్నాఁడు. ఇట షట్పదాన్వేషణ మిఁక సాఁగ దను బుద్ధితో సాఁగిపోవుచుండఁ బర్యంకబంధ స్థిర పూర్వకాయము, ఋజ్వాయత సన్నమితో భయాంసము, ప్రఫుల్ల రాజీవభ్రమకృ దుత్తాపాదద్వయ సన్నివేశము నగు పరమేశ్వరరూపము గోచరించినది. నా చూపు ప్రాణాపానాది మరుత్పంచకమును నిరోధించిన మహేశ్వరుని భుజంగమోన్నద్ధ జటాకలాపముపై నిల్చి కర్ణావసక్త ద్విగుణాక్ష సూత్రమును గని కంఠప్రభాసంగ విశేషనీల కృష్ణాజినముపైఁ బర్వినది. వృష్టిసంరంభము లేని యంబువాహము వలెఁ, దరంగ రహితమైన నీరాధారము వలెఁ నివాతనిష్కంపప్రదీపము వలెఁ, బరమశివుఁ డటనుండఁ గని యిట భ్రమరములకై వెదకుట 'వెఱ్ఱియన్వేషణ' మని నిశ్చయించి తిరోగముఁడ నగుచున్నాను.

అందుకు వ్యతిరిక్తముగ నా హిమగిరి రాజపుత్రి నిత్యకైంకర్యమునకై సమ్మోహనరూపమున సదాశివుని సన్నిధానమునకు వచ్చుచున్నది. సుగంధ నిశ్శ్వాస వివృద్ధతృష్ణుఁడై యొక సారంగాధీశ్వరుఁడు గిరిసుతాబింబాధరాసన్న సీమఁ జరింపనామె ప్రతిక్షణ సంభ్రమలోలదృష్టితో విలోకించుచు లీలారవిందమున నివారించు దృశ్యమును జూచియు నిట నింక భ్రమరాన్వేషణము పొసంగు టెట్లనుకొంటిని. ఆ మాట వూకుటీరమున నున్న కవికులగురువు చెవిఁబడెనేమో! 'అలక కేఁగుము, [1]అట పాదపములు నిత్య పుష్పములు, నున్మత్తభ్రమర ముఖరములు' నని

సెలవిచ్చినాఁడు.
  1. అట పాదపములు - మేఘసందే. సర్గ 2, శ్లో 3

48

వావిలాల సోమయాజులు సాహిత్యం-4