పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది



సీ. [1]"గగన స్రవంతిలోఁ గల సువర్ణాబ్జంబు
             లందు మే లేర్చి తా నపహరించి,
     మానసంబు శఠాత్ముమానసంబునుబోలె
             నిస్సారసత్త్వంబు నెఱయఁ జేసి
     బిందుసరమ్ములోఁ గుందనపుం దమ్మి
             పేరులేకుండంగఁ బెల్లగించి
     సౌగంధికాఖ్యకాసారంబు జలమాత్ర
             శేషమై దీనతఁ జెందఁ జేసి”

వజ్రనాభుని వంటి రక్కసులే కేళాకూళులఁ బోషించి రసికజన రాజేంద్రు లనిపించుకొనినారు. అట్టి యెడ నార్యధర్మాభినిష్ఠ గల [2]

శ్రీహర్ష చక్రవర్తి వనపాలన దక్షుఁడై యుంట తప్పదను నాశతో నతని సాహిత్యోద్యానమునఁ బ్రవేశించితిని. అప్పు డందొక పద్మాకరమున భ్రమరయువకుఁ డొక్కఁడు కమలమును జేరి మరందపాన మొనర్చుచుండ హిమానీవర్షము కురిసినది. అతఁడు మంచుదెబ్బ తగిలి పడిపోయినాడు. అంతకుమున్నే వారి పరిచయ మొనర్చుకొని ప్రక్క నిలచియున్న నాతో నా కవిచక్రవర్తి యా కరుణదృశ్యమును జూపి 'వామే విధానహి ఫలం త్యభివాంఛితాని' (దైవము ప్రతికూలముగా నుండఁగా గోర్కెలు ఫలింపవు కదా!) యనినారు

పిమ్మటఁ గొంత కాలమునకు [3]బిల్హణభట్టు విక్రమాంక వనమునఁ బ్రవేశించితిని. అప్పు డట నొక పెనుగాలి పుష్పలోకప్రళయమై యొప్పినది. పుష్పధూళి చెలరేఁగి కన్నులఁ గప్పుటచే రెప్ప లల్లార్చుచు నాకాశపథమున కెగయుచున్న యళిసంతానములు బహుళ పౌరందరచాపవిభ్రాంతులఁ గల్పించి యనతికాలములోఁ గారుచీఁకట్ల గగనవీథిఁ గప్పినవి.

ఇఁక సంస్కృతసాహిత్యవనీవీథుల షట్పదాన్వేషణ మొనర్ప బుద్ధి వోకుండుటచే నాంధ్రసాహిత్య పుష్పకాననములఁ బ్రవేశించితిని. ఆదిలో నది 'సంహితాభ్యాసి' వనము. ఛందోముఖరితమై యొప్పు నిందుఁ గేవలము శుకానువాదములు తప్ప విన్పింపనేమో యను సందేహము కలిగినది. కాని యదృష్టవశమున నాదియందే నన్నయ 'కమ్మని లతాంతమ్ములకు మ్మొనయు మధుప సంతానముల' మధురఝాంకరణములు విన్పించినవి.

తదుపరి నే ప్రవేశించినది తిక్కనార్యుని 'రామాయణ వనము'. తొలుదొల్తఁ

బ్రభువగు శ్రీరామచంద్రమూర్తికి [4]వనపాలిక మత్తమధుపములకుఁ దప్పి
  1. 76. గగనస్రవంతిలో ప్రభా. ప్రద్యుమ్నము అ. 2
  2. 77. శ్రీహర్షచక్రవర్తి - నాగానందాది నాటకకర్త - ఇట నున్న భావమునకు మూలము ప్రియదర్శికలోని “సంజాతసాంద్ర మకరందరసాం క్రమేణ పాతుం గతశ్చ కళికాం కమలస్య భృంగః దగ్ధా నిపత్య సహసైన హిమేన చైషా వామే విధౌ నహి ఫలం త్యభివాంచితాని ॥"
  3. 78. బిల్హణభట్టు (క్రీ.శ. శతాబ్ది) కర్ణ సుందరీ, విక్రమాంక దేవచరిత్రాది గ్రంథకర్త
  4. 79. వనపాలక మత్త - నిర్వ. ఉత్త. రామా. ఆ. 8, ప. 25

మణిప్రవాళము

49