Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సోమయాజులుగారి సాహిత్య సృజనా జీవితం బహువిపులమైంది. ఇరవై ఏళ్ల వయస్సులోనే ప్రారంభమైన వారి సాహిత్య సేవ జీవితాంతం కొనసాగింది. ఇంత బహుళంగా రచనలు చేసిన వారి సంఖ్య చాలా తక్కువ. అందులోనూ ఇన్ని ప్రక్రియలలో రచనలు చేసినవారు మరీ అరుదు. ఆయన కవిత్వం రాశారు. అందులో పద్యరచనలూ ఉన్నాయి, గేయ రచనలూ ఉన్నాయి. అతిసాధారణ వచనాన్ని కూడా అటు పద్యంలోనూ, ఇటు గేయంలోనూ ఇమిడ్చి మనోహరంగా రచింపగలిగిన శక్తి వారిది. నాటకాలు రాశారు, నాటికలు రాశారు. పద్య నాటికలు రాశారు, గేయనాటికలు రాశారు, సంగీత రూపకాలు రచించారు. శ్రవ్య నాటికలు రాశారు. నవలలు రాశారు. ఆంగ్లం నుండి నాటకాలూ, నవలలూ అనువదించారు. వీటిలో షేక్సియర్‌ నాటకానువాదాలు తెలుగులో వావిలాల వారివే బహుజనాదరణ పొందాయి. హిందీ నుండి మహాకవి జయశంకర ప్రసాద్‌ కావ్యాలు 'కామాయని , 'ఆంసూ” లను అతిమధురంగా పద్యకావ్య రూపంలో అనువదించారు.


ప్రౌఢ కవి అయిఉండీ పిల్లలకోసం సరళవచనంలో నవలలూ, దేశనాయకుల, దేశభక్తుల, చారిత్రక వ్యక్తుల, కవుల జీవిత గాథలూ రచించారు.

ఆయన పద్యరచన ఎంత విపులమో గద్యరచనకూడా అంతే విపులం. కథలు, జీవితగాథలు, నాటకాలు, నవలలను పక్కన బెడితే ఆయన సృష్టించిన వ్యాస సాహిత్యం అపారం. పరిశోధనాత్మక వ్యాసాలెన్నో రచించిన సోమయాజులుగారు సృజనాత్మక వ్యాసాలూ విసృతంగా రాశారు. ఆయన ఎంపిక చేసుకున్న విషయాలే మనల్ని విస్మయ పరుస్తాయి. డజనుకు పైగా వ్యాసాలు వివాహం పైనే అంటే ఆయనకు ప్రజల సాంఘిక జీవనం మీద, ఆచార వ్యవహారాల మీద ఉన్న పట్టును, అవగాహనను మనం అర్థం చేసుకోవచ్చు, మూడుపదుల వయస్సులో ఆయన వాత్స్యాయన కామసూత్రాలపై సాతవాహన సంచికలో రాసిన బృహద్య్యాసం నేటికీ పరిశోధన వ్యాసానికి ఉదాహరణ ప్రాయంగా నిలుస్తుంది. ఆయన ఏమి రాసినా అది ప్రామాణికమే. తాను చెప్పే ప్రతి విషయానికీ ఆయన ఆధారం చూపుతారు.