సోమయాజులు గారి రచనలకు మరోపార్శ్వం కూడా ఉంది. ఆధ్యాత్మికంగా భారతీయ దార్శనికతా ప్రియుడైన ఆయన బహాయీ సాహిత్యాన్ని అనువదించారు. క్రైస్తవ రచనలను అనువదించారు.
సోమయాజులుగారు ఇంగ్లీషులో కూడా కొన్ని వ్యాసాలు రచించారు.
సాహిత్యాచార్య, సాహిత్యరత్న, సాహిత్య బంధు, మధురకవి, కవి భూషణ, కుమార ధూర్జటి, పద్యవిద్యాధర వంటి అనేక బిరుదాలతో ఆంధ్ర సాహిత్యలోకం వావిలాల సోమయాజులు గారిని సమ్మానించింది. ఈ బిరుదులు ఆయన రచయితగా ఒకవైపు, సాహిత్య సేవకుడుగా మరోవైపు చేసిన కృషికి అద్దం పడతాయి.
ఐదు దశాబ్దాలకు పైబడిన సాహిత్య జీవితంలో సోమయాజులుగారు చేసిన అసంఖ్యాక రచనల్లో ఎన్నో అలభ్యంగా ఉండిపోయాయి. కొన్ని అముద్రితాలుగా ఉండిపోయాయి. లభించిన రచనల్లో ముద్రితా ముద్రితాలన్నింటిని కలిపి ఇప్పుడు ఆయన లభ్యరచనల సమగ్ర సంపుటాలను ప్రచురించే ప్రయత్నం చేస్తున్నాం.
ఈ సంపుటులలో ఇది నాల్గవది.
ఈ సంపుటిలో వావిలాల సోమయాజులుగారు తమ సుదీర్ఘ రచనా జీవితంలో రచించిన అనేక వ్యాసాలున్నాయి. వ్యాసరచనలో సోమయాజులు గారిది విశిష్టమైన శైలి. ఆయన ప్రామాణికతకు పెద్దపీట వేస్తారు. ఆయన వ్యాసంలో శాస్త్రీయత, ప్రామాణికతతో పాటు సృజనాత్మకత, చక్కగా చదివించే శైలి, సమగ్రతా లక్షణాలుంటాయి. ఒక విషయానికి ప్రామాణికత పూర్వవిద్వాంసులు నిష్కర్షల నుండి వస్తుంది. బహుగ్రంథ పఠనం, ఆ చదివిన విషయాలను తాను చెప్పదలచుకున్న విషయానికి సమన్వయించడం వారి పరిశోధన వ్యాసాలలో అడుగడుగునా గోచరిస్తుంది. శాతవాహన సంచికలో ప్రచురితమైన వాత్స్యాయనుడు - కామ సూత్రాలు అన్న వ్యాసానికి 103 అధోజ్ఞాపికలున్నాయి. అధోజ్ఞాపికలలో వారు ఉటంకించిన గ్రంథాలు, వ్యాసాలు చూసినప్పుడు ఒక్క వ్యాసరచనకు ఆయనెంత శ్రమించిందీ మనకర్థమవుతుంది. 'మణిప్రవాళము' లోని 8 వ్యాసాలకు 151 అధోజ్ఞాపికలున్నాయి.
5