ముందుమాట
శ్రీ వావిలాల సోమయాజులు (19.1.1918 - 9.1.1992) గుంటూరు జిల్లా విప్రులవల్లె అగ్రహారంలో జన్మించారు. తండ్రి సింగరావధానులుగారు, తల్లి మాణిక్యాంబ గారు. నరసరావుపేట, గుంటూరులో వారి విద్యాభ్యాసం జరిగింది. భార్య కైకమ్మగారు.
సోమయాజులుగారు 1940-46 మధ్య గుంటూరులోని శ్రీ శారదానికేతన ప్రాచ్య కళాశాలలో ప్రధానాచార్యులుగా పనిచేశారు. ఆ తర్వాత 1976లో పదవీవిరమణ పొందేవరకు గుంటూరు హిందూ కళాశాలలో అంధ్రభాషోపన్యాసకులుగా పనిచేశారు.
సోమయాజులుగారి జీవితం పూర్తిగా సాహిత్య రచనకు, సాహిత్య ప్రచారానికే అంకితమై పోయింది. తనకు ఇరవయ్యేళ్లు నిండీ నిండకముందే సాహిత్య నంస్థలలో సభ్యుడిగా సాహిత్య సేవ ప్రారంభించారు. 1939 నుండి సాహితీ సమితి సభ్యులు. ఈ సమితికి సహాయ కార్యదర్శిగా, కార్యదర్శిగా వ్యవహరించారు. నవ్యసాహిత్య పరిషత్తుకు సహాయ కార్యదర్శి. “ప్రతిభా పత్రికకు రచనలను ఎంపిక చేసే నిర్జాయక సంఘంలో సభ్యుడు. 1963-78 మధ్య ఒక దశాబ్దం పాటు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ సభ్యులు.
సోమయాజులుగారు సంస్కృతాంధ్రాంగ్లాలలోను, హిందీలోను గొప్ప పండితులు. ఒక భాష నుండి మరొక భాషలోనికి అనువాదం చేయగలిగిన సమర్థత కలిగినవారు. వచనాన్నే కాదు పద్యాన్ని పద్యరూపంలోనే అనువదించడంలో సిద్ధహస్తులు. ఆయన సహజంగానే కవి కావడంవల్ల అనువాదంలోనూ మూలకావ్యం లోని కవిత్వాంశను నంపూర్ణంగా ప్రదర్శించగలిగిన కవితా హృదయాన్ని సొంతం చేసుకున్నారు.