పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


కావ్యలోకమున నాయికానాయకు లీ మైత్రి నాధారముగ గ్రహించి గర్భితోక్తుల సంభాషింతురు. ఒక [1]“నాయకుఁడు నాయిక నుద్దేశించి 'తుహినాంశు బింబమును గనని నళినీ జన్మము నిరర్థకము గదా!' యన నాయికయు 'నళినీ సౌభాగ్యావలోకన మొనర్పని చంద్రోత్పత్తియు నిష్ఫల' మని సాభిప్రాయయై సమాధాన మొసఁగినది. ఆకసముననున్న చంద్రుఁడు కేవల [2]పరోపకార బుద్ధితోఁ గుముదావబోధన మొనర్చుచున్నాఁడని చెప్పుచు నీ మైత్రి లక్షణము నెఱుఁగని యొక కవిశేఖరుఁ డున్నత చేతసులు పరోపకారవ్యసనజీవితు లను నర్థాంతరమును నిరూపించినాఁడు.

కుముదినీప్రణయముతోఁబాటు శశాంకునకుఁ బద్మవైరమును గవి లోకసిద్ధము. దీనిని గ్రహించిన యొక మహాకవి -

తే. [3]తామరసలక్ష్ము లాచందమామ రాకఁ
   గలఁగుచును గుముదాలికై తొలఁగు నపుడు
   తొలఁగు బావయె కాఁడె తమ్ముల వరించు
   నట్టి సతులకు నతఁడు మున్నెట్టిఁ డైన

యని పల్కినాఁడు. ఈ యంశమునే సమ్మోహనముగ మఱియొక మహాకవి:

శా. [4]ఈ వబ్జుండవు నీటఁ బుట్టితి సుమీ యే నంచు మోమోటపుం
   ద్రోవ ల్సెప్పఁగ సిగ్గుగాదె మఱి నీ తోఁబుట్టు శ్రీదేవి లీ
   లావాసంబుసిరుల్ హరింతు వనుచో నయ్యో కళాదుండు చే
   తోవీథిన్ సహజాధనాపహరణోద్యోగంబు నెగ్గించునే!”

యని నిరూపించినాఁడు.

విరహిణులకు విధుమండలమునకుఁ జుక్కెదురు. తాపాపనోదనమునకై తరిపి వెన్నెలల సుధాంశుని శైత్యమును నమ్మి విహరింప శీతకరుఁడుఁ ఘృతకోశాతకి యగుట పరిపాటి. ఈ విషమ ప్రకృతిని భరింపలేక ప్రతిప్రబంధ నాయికయును జంద్రోపాలంభనకుఁ గడంగినది. ఒక యింతి చంద్రుని 'నింతుల నేఁచు పాతకము నీకజహత్కళంక' మని పల్కినది.

సీ. [5]"శ్యామకంఠలలాటసామీప్యపరితప్త
           మౌనంబులుగఁ గళల్ మార్చి మార్చి
    సింధూదకాంత స్సమింధన బడబాన
          లోగ్రకీలల సెగ నూని యూని

  1. ఒక నాయకుఁడు - బిల్హణయామినీపూర్ణతిలకల సంభాషణము
  2. కేవల పరోపకార బుద్ధితో - భవభూతి కృతమైనట్లు గదాధరభట్టు రసిక జీవనమున నుదాహరించిన “కిం చంద్రమాః ప్రత్యుపకార లిప్సయా, కరోతి గోభిః కుముదావ బోధనమ్, స్వభావ ఏవోన్నతచేతసాం సతాం, పరోపకార వ్యసనం హి జీవితమ్"
  3. తామరసలక్ష్ము - ప్రభావతీ ప్రద్యు. ఆ. 4, ప. 123
  4. ఈ వబ్జుండవు - వసు చరిత్ర ఆ. 4, ప. 34
  5. శ్యామకంఠ - ప్రభా. ప్రద్యు. ఆ. 4, ప. 153


_________________________________________________________________________________________________

మణిప్రవాళము

37