Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది



     హరణక్రూరతరాంకుశం బనఁగ నుద్యల్లీల మీ రేఖ ని
     త్యరుచిన్ బోల్పఁగఁ బెంపగున్ విదియచంద్రా! రోహిణీవల్లభా!!"

యని యా దైవతమును గృతాంజలియై బ్రార్థించినాఁడు.

జంద్రుని యందలి నైల్యమునకు భావుకలోకము బహువిధ కారణములఁ బలికినది. ఒకరు తిమిరచయమును మ్రింగ నది జీర్ణింపక యిట్లు కడుపున గడ్డకట్టిన దనినారు. తమ యమృతంపు బావి యగు శీతకరమండలము నుండి దేవతలు పీయూషమును జేదుకొన నది యడుగు దగులుటచే నందలి ప్రౌఢపంక మీ రీతిగఁ గన్పించుచున్నదని యొకరు భావించినారు.

మ. [1]రతినాథుం డను మాయజోగి చదలం త్రైలోక్యవశ్యాంజనం
    బతియత్నంబునఁ గూర్చి మౌక్తికమయం బైయున్న పాత్రంబునన్
    మతకం బేర్పడఁ బెట్టి దాఁచె నన నీ మధ్యంబునన్ మచ్చ సం
    తతమున్ గన్నుల పండువై వెలయుఁ జంద్రా! రోహిణీవల్లభా!!"

యని నీలాంకమున నింగిఁదోఁచి వెలుఁగు వెలుఁగురాయని గీర్తించినాఁడు. ఇది చంద్రుని యందలి కృష్ణసారమని కొందఱి నమ్మకము. అందుచేతనే యతఁడు కురగలాంఛఁ డైనాఁడని వారి యభ్యూహము. ఈ కారణముననే యొక కవి 'చంద్రునిలో నిట్టి నేల చంగలి మేసెన్" అను సమస్యను బూరింప నొక ప్రాచీనాష్టావధాని కొసఁగ నతఁడు పాశుపతాస్త్ర ప్రదాన సమయమున ఫాలాక్ష ఫల్గును లొకరితో నొకరు పోరాడువేళ నర్జునుని తపోభూమిఁ బుట్టిన పచ్చికను గ్రిందైన చంద్రశేఖరుని శిరమందున్న శశిఖండ మందలి మృగశాబకము భక్షించె ననుభావము వచ్చునట్లు పూరించినాఁడు. ఈ మచ్చ రోహిణీవల్లభునకుఁ దారాజారత్వమున వచ్చిన దుష్కీర్తియని కొందఱ యభిమతము. అది దోషమైన నగుఁగాక! మహాకవి కాళిదాసు వంటివాఁడే [2]అనంతరత్న ప్రభవుఁడగు నా శైలాధిపునకు హిమము సౌభాగ్యవిలోపి కాదు, లోకములో ననేక గుణములలో నొకదోషము లెక్కకు రాదు. చంద్రుని కిరణములందు నీలాంకము వలె మునిఁగి పోవును" అని ప్రవచించినాఁడు.

పద్మినీ కమలాప్తుల బాంధవమును బోలినదే కుముదినీ కైరవమిత్త్రుల మైత్రి. తారకాధీశు కిరణకదంబకము చిలుకు పలుచని వలిపంపు జిలుఁగుమంచు గైరవశ్రీ

వధూకరగ్రహణ వేళ వెలికిఁ గ్రమ్మిన సాత్విక స్వేదము.
  1. రతి నాథుండను - పూర్వోదాహృతము 175
  2. 56. అనంత రత్న ప్రభవుఁడు కాళిదాసు కుమార సం. సర్గ 1, శ్లో 3

_________________________________________________________________________________________________

{rh| 36 | | వావిలాల సోమయాజులు సాహిత్యం-4 }}