అప్రతిమానమహిమ నాకు ప్రాప్తించుగాక' అన్నది గాయత్రికి అర్థము. బౌద్ధ జాతకాలాలో సూర్యోపాసన ఉన్నది. బౌద్ధుల స్తూపమే ఉదయసూర్యునికి సంజ్ఞ.
భారతదేశంలోని సూర్యోపాసన వల్ల మొదట కొందరు పౌరులు ఏర్పడ్డారు. వారు క్రమంగా నశించి వైష్ణవులైనారు. ఒరిస్సాలో బౌద్ధం వైష్ణవ ప్రభావం వల్ల మారి సూర్యోపాసనగా మారింది. కోణార్క దేవాలయం భారతదేశ సూర్యదేవాలయాలలో అత్యుత్తమమైంది. భువనేశ్వరంలోనూ, ముల్తానులోనూ మరి రెండు దేవాలయాలు కనిపిస్తున్నవి. ఎల్లోరాలో కేవలం శిల్పమే ఉన్నది.
ఒరిస్సా చరిత్ర వ్రాసిన హంటర్ మహాశయుడు 'Sun-worship in Orissa formed one of the religions into which Buddhism disintegrated, a religion of Vaishnavite type, identified with the Vishnavite dynasty. From the earliest times, Vaishnavaism and Sun worship stand together in close affinity, indeed, in the Vedas, Vishnu who developed into the second diety of the Hindu triad, appears only as a form of the Sun' (Hunter's Orissapp. 228) ఈ అభిప్రాయాన్నే వెలిబుచ్చినాడు.
సూర్యదేవుని విగ్రహ నిర్మాణ విషయంలో శిల్పశాస్త్రాలు రెండు విధాలుగా ఉన్నవి. రథం మీద పద్మంలో కూర్చునిగాని, నిలుచొని గానీ సప్తాశ్వాలు లాగుతూ ఉన్నట్లు చిత్రితుడు కావలెనని నియమం ఉంది. ముందు అనూరుడు సారథిగా ఉంటాడు. కొన్ని సందర్భాలలో అతని భార్యలు ఇద్దరూ ఉంటుంటారు. ఉష కూడా ఉండవచ్చు, మూడవ భార్యగా. దండ, పింగళులు అతని ద్వారపాలకులు. పింగళుడు, కుంభోదరుడు. కత్తిగాని, మషీపాత్రను గానీ, పట్టుకొని ఉంటాడు. దండుడు చేతిలో కత్తి, దండము, శంఖములలో ఒకదానిని పట్టుకొని ఉంటాడు. మత్స్యపురాణంలోనూ, బృహత్సంహితలోనూ సూర్య విగ్రహాలు నిర్మించేటప్పుడు స్థపతి మోకాలి దగ్గిరనుంచి క్రింది భాగాన్ని చిత్రించకూడదని ఉన్నది. దానికి గొప్ప శాపం విధించారు. (Iconography of Buddhist and Brahminical Sculptures N.K. Bhattasati p. 157) అందువలన ఆ భాగం ఏ సూర్యవిగ్రహానికీ కనిపించదు. కొన్ని సందర్భాలలో నాగులు ఆయన రథాన్ని అడ్డుకుంటున్నట్లు చిత్రిస్తారు. దీనిని గురించి భోజరాజు ఆస్థానంలో ఒక వృద్ధ కవయిత్రి చెప్పిన చాటువులో 'రథస్యైకం చక్రం భుజగనమితాః సప్తతురగాః, నిరాలంబోమార్గః, చరణవికల స్సారథి రపి, రవిర్యాత్యేవాంతం, ప్రతిదిన మపారస్య నభసః, క్రియాసిద్ధిస్సత్తే భవతి మహతాం నోపకరణే' అని 'భుజగ నమితా’