దక్షిణ దిగవస్థితుండగు సూర్యుండు కర్కటాయన పర్యంతంబు నుత్తరంబు నడుచుటం జేసి ఉత్తరాయణం బయ్యె. ఈ చందంబున నుత్తరంబు పింగళాస్థితుండగు పవనుండు యావత్కాలంబు నీడయందు సంక్రమించునంత కాలంబుత్తరాయణం బీ ప్రకారంబున దక్షిణాయనంబు నెఱుంగునది. ఇది స్కాందపురాణ రహస్యము. మానవుని ప్రాణ ముద్గమించునట్లు జగత్ప్రణమైన సూర్యుడు నాక్షమునుండి బయలు దేరినాడు. తిరిగి నాక్షమును చేరినచో సూర్యగోళముండదు. '
సంక్రాంతిని ఉత్తరాయణ సంక్రాంతి అనటమే కాక సంక్రమణము అని అనటమూ కద్దు. 'సంక్రుమయ్య' సంక్రమణానికి ప్రతీక. ప్రతిమా రూపాన్ని పొందిన దేవత. సంక్రమణ శబ్దాన్ని యోగశాస్త్రపరంగా మహాకవి శ్రీనాథుడు కాశీఖండంలోనే 'మొదల సుషుమ్న జొచ్చు నిడబుట్టిన గాడుపు కొంతసేపునం బిదప సుషుమ్న బుట్టిన సమీపము జొచ్చునిడాఖ్య నాడికన్, మొదల పిమ్మటన్ బవనముల్ తిరుగంబడి చొచ్చు గాన, నయ్యదనులు సంక్రమంబులని యాడుదురాగమ తత్వకోవిదుల్' అని అన్నాడు. సూర్యుడు దక్షిణ మార్గాన నడుస్తున్నప్పుడు, ఆయన కిరణాలవల్ల పుట్టిన గాలులు ఉత్తరాపథాన నడవటం ప్రారంభించిన తరువాత పుట్టిన గాలులతో తిరగబడి పోరాటం వల్ల సంక్రమణం ఏర్పడుతుంది.
మకర సంక్రాంతిని భారతదేశంలోని కొన్ని ప్రాంతాలవారు అజసంక్రాంతి అని కూడా వ్యవహరిస్తారు. ఋగ్వేదంలో ఇంద్రుడు చేసిన అనేక ఘనకార్యాలలో ఒకటి, ఒక మేక చేత పులిని చంపించటం. అది 'అత్రేణ చిత్తద్వేకం చకా సింహ్యం చిత్వేత్వే నాజఘానం’ (Viii-18-17) అన్న సూక్తం వల్ల తెలుస్తున్నది. ఇది ఒకానొక జ్యోతిషాంశానికి పూర్వ ఋగ్వేద కవులు కల్పించిన కవితాస్వరూపమని నేటి భారతీయ, జ్యోతిష శాస్త్రవేత్తల అభిప్రాయము. సింహరాశి అస్తమిస్తేగాని అజరాశి (మకరం) ఉదయించదు. పూషుని రథాన్ని అజము లాగినట్లు ఋగ్వేదంలో అనేక వర్ణనలు కనిపిస్తున్నవి. ఇది కేవలం అజము కాదు; కొంత మీనము; కొంత అజము. అందువల్ల మన్మథుడు (ధనుస్సు) మొదట మీనకేతనుడు; తదుపరి అజము - మకరంగా భావితం కావటం ప్రారంభం కాగానే మకరకేతను డైనాడు.
సంక్రాంతి సూర్యోపాసన, 'రావణునితో యుద్ధం చేస్తూ అలసిపోయిన రామచంద్రునికి అగస్త్యులవారు ఉపదేశించినట్లు, ఆదిత్య హృదయాన్ని, మహర్షి వాల్మీకి చెపుతూ ఆదిత్యుడు సమస్త' మని చెప్పినాడు.