పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/349

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అందువల్ల జ్యోతిష శాస్త్రజ్ఞులు సూర్యదేవుని మార్గాన్ని ఉత్తరాయణమూ, దక్షిణాయనమూ అని రెండు విధాలుగా విభాగించారు. 'పంచపాదం పితరం ద్వాదశాకృతం దివ ఆహుః పరే అర్ద పురీషిణమ్, అథేమే అన్య ఉపరే విచక్షణమ్ సప్తచక్రే షడర ఆహు రర్పితమితి' (ఋగ్వేదము 1-164-12). (కొందరు ఇతణ్ణి అయిదు పాదాలు పన్నెండు రూపాలు ద్వాదశమాసాలు కలిగిన పిత అనీ, ఏడు చక్రాలూ ఆరు ఆరాలు (షడృతువులు) కలవాడనీ, వర్ష ప్రదాత అనీ అంటారు) దీనిని బట్టి సూర్యుడు ప్రాణమనీ, కాలకర్త అనీ, విభక్త అనీ, జగత్పిత అనీ భారతీయులు ఋగ్వేదకాలంనుండే గ్రహించినట్లు అర్థమౌతున్నది. ఈ శ్రుతి ప్రమాణానికి అనుగుణంగా ప్రశ్నోపనిత్తులోని 'సంవత్సరోవై ప్రజాపతిః, తస్యాయనే దక్షిణాం చోత్తరం చ తథ్యేహవై తదిష్టాత్పూర్తే కృత మిత్యువాసరే, తే చంద్రమస వేన – లోకమభి జయంతే, తమేహ పునరావర్తతే, తస్మాదేతి ఋషయః ప్రజా కామా దక్షిణం ప్రతి ప్రతిపద్యంతే, ఏషహవై రయిర్యః పితృయాణః' (ప్రశ్నోపనిషత్తు ప్రథమ ప్రశ్న 9. సంవత్సరము ప్రజాపతి ఉత్తర దక్షిణాలు. ఆయన మార్గాలు. ఇష్టా పూర్తమొనర్చినాడు. చంద్రలోకాన్ని చేరుతాడు. ఇది పితృయానము. ) ఉత్తర ప్రయాణాన్ని దేవయానంగా చెప్పినారు. అందువల్లనే అది పుణ్యకాలం అయింది. 'శుభాన్ని' కలిగించేది కాబట్టి పుణ్యము. ఆదిత్యోహవై ప్రాణో; రైరేవ చంద్రమా (ఆదిత్యుడు ప్రాణము; పదార్థము చంద్రుడు) అని శ్రుతి ప్రమాణాలు కనిపించటం వల్ల, భీష్మాదులు ఉత్తరాయణ పుణ్యకాలంలో మృతి పొందటం వల్ల పునర్జన్మ కలగదనే భావంతో దానిని ఆశించి నిరీక్షించారు. సూర్యుడు ఉత్తరాయణం వేళ జ్యోతిస్సును లోకానికి ప్రసాదించటం వల్ల పుణ్యనదుల్లో స్నానమూ, కూష్మాండాది మహాదానాలూ అలాంటి వేళ చేయటం యుక్తమని ఆర్యులు భావించారు. ఇటువంటి విజ్ఞానంతో ఎవరైతే ఆయనను పూజిస్తారో, భావించి, దర్శిస్తారో వారికి పుణ్యలోక ప్రాప్తి కలుగుతుందట. 'అథోత్తరేణ తపసా బ్రహ్మ చర్యేణ శ్రద్ధయా విద్యాత్మాన మన్విష్యాదిత్య మభిజయస్తే' అనేది దీనికి ప్రతి ప్రమాణము.

పతంజలి యోగశాస్త్రాన్ని లోకంలో ప్రవేశపెట్టిన తరువాత, ఈ ఉత్తర దక్షిణాయనాలు రెండూ సూర్య సంబంధమైన ఆదిత్యుని పరంగా అందులో ప్రవేశించినవి. కాశీ ఖండంలో మహాకవి శ్రీనాథుడు యోగశాస్త్ర విషయకమైన ఉత్తరాయణ దక్షిణాయన విభేదాన్ని క్రింది రీతిగా నిరూపించినాడు. 'ప్రాణంబ ఆదిత్యుండు ఆదిత్యుండ చంద్రుండు... ఇడా నాడియందు చంద్రుం డధివసించి యుండుం గావున నందు పవనం బుద్దమించు కాలంబు రాత్రి. ప్రవేశించు కాలంబు పగలు. పింగళానాడియందు సూర్యుం డధివసించుగావున మకరాయన సమయంబున