లేచి మామిడితోపులకు వెళ్లి అక్కడ ఉన్న ఏడుగురు కన్నెరాళ్ళ దగ్గిరకు వెళ్ళి, పూజ అయిన తరువాత చక్రాకృతిగా చేరి, చేతులతో తాళం వేస్తూ పాటలు పాడుతారు. వాటినే 'గుమ్మి తట్టర పాట్టు' అంటారు. వంగి (కన్నెలకు) చప్పట్లు చరుచు పాటలని వీటి అర్థము. ఈ కన్నెలు ఎవరనే విషయంలో అభిప్రాయభేదాలున్నవి. వీరు ఎందరు అనేవిషయంలోనూ అభిప్రాయ భేదం ఉంది. కొన్నిట్లో ఏడుగురు అని కనిపిస్తున్నది. కన్నెపాటల్లో 'ఇంద తెరువిలే ఆరుకన్ని, అంద తెరువిలే ఆరు కన్ని' అనే పాటలవల్ల పన్నెండు మందిగా వ్యక్తమౌతున్నది. కొందరు వీరు ప్రకృతి శక్తులన్నారు. జైగన్ బాల్ అనే శాస్త్రజ్ఞుడు 'శక్తినుంచి ఏర్పడ్డ నూతన శక్తులు' అన్నాడు. (Geneology of South Indian Gods, B. Ziegenbalg - Translated into English by G.J. Metzger, Madras - P P 36-7) కొందరు ఈ కన్నెలను బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ప్రకృతి శక్తులన్నారు. కొందరు 1. మారెమ్మ, 2. ఎల్లమ్మ, 3. అంకాలమ్మ, 4. భద్రకాళి, 5. పిండారి, 6. చాముండ 7. దుర్గ, 8. పురన్నై 9. పుడికాళైలన్నారు. ఇందులో చివరి ఇద్దరూ అయనారు భార్యలట. తమిళ నిఘంటువు వీరు ఏడుగురు అక్క చెల్లెళ్ళనీ, వరుసగా పిఠామణి, నవయాని, మోక్షేశ్వరి, కౌమారి, వారాహి, రుద్రాణి అని చెపుతున్నది. వీరు సంస్కృత సాహిత్యంలోని సప్తమాతృకలు.
దక్షిణ భారతంలో కనుపించే ఆచార వ్యవహారాలలో కొన్ని ఆర్యసంప్రదాయాలూ, కొన్ని ద్రావిడ సంప్రదాయాలూ కనిపిస్తున్నవి. ద్రావిడ సంప్రదాయాలలో విశేషాలన్నీ అరవ దేశంలో కనిపిస్తవి. ఒక రచయిత ఉద్దేశాన్ననుసరించి 'ఉత్తర సర్కారుల వారు అరవదేశం నుంచి గొబ్బిపూజ, పొంగలి నైవేద్యము గ్రహించినారు. వారు 'మాట్టు పొంగల్' ను గ్రహించలేదు. కడప, చిత్తూరు జిల్లాలకు, తమిళ దేశానికి దగ్గర సంబంధం ఉండటం వల్ల అక్కడ పశువుల పండుగ కూడా కనిపిస్తున్నది. కన్నడులు 'పొంగలి'కి పశుపూజను గ్రహించారు. కాని ధనుర్మాసంలో 'గొబ్బిపూజ' ను, అక్కడి గొబ్బిపాటలను నృత్యాన్ని గ్రహించలేదు. కాని గొబ్బి, ఆంధ్రదేశం నుంచి తమిళ దేశానికి వెళ్ళినట్లు కనిపిస్తుంది. బౌద్ధం ఆంధ్రంలో వ్యాపించినట్లు తమిళ దేశములో లేదు. గొబ్బి పాటలు తెలుగుదేశంలో విశేషంగా కనిపిస్తున్నవి.
సంక్రాంతి పండుగను ఉత్తరాయణ పుణ్యకాలం అని ఆంధ్రులు వ్యవహరిస్తారు. 'అయన' శబ్దానికి మార్గమని అర్థము. 'రషాభ్యాం నో ణస్సమానపదే' అనే పాణినీయసూత్రం వల్ల 'అయణము' ఔతుంది. సూర్యుడు పన్నెండు రాశుల్లో ప్రయాణం చేయటానికి పన్నెండు నెలల కాలం పడుతుంది. ఆయన కటకాది నుంచి మకరం వరకూ దక్షిణంగానూ, మకరం నుంచి కటకం వరకూ ఉత్తరంగానూ పయనిస్తాడు.