విశేషభాగం సంక్రాంతి పుణ్యకాలంలో జరిగినవై ఉంటవి. ఎంతటి పేద ఐనా, వైదికుడైనా ఆ నాడు తిలతర్పణాలు విడిచి అధమం ఒక కూష్మాండాన్ని దానం చేసుకుంటాడు. ఇది విశ్వాండానికి ప్రత్యామ్నాయమైన దానం. జగత్సంజ్ఞ (Symbol). సంక్రాంతినాడు 'పొంగలి' చేసుకొని గౌరమ్మకు, సంక్రుమయ్యకు, ఇతర దేవతలకు నైవేద్యం పెట్టటం కనిపిస్తున్నది. 'పొంగలి' ఒక భోజ్యవిశేషము.
అరవలు సంక్రాంతిని 'పొన్గాల్' అంటారు. 'పొంగలి' పండుగకు మొదటి నామమై, తరువాత ఆ నాటి భోజ్యపదార్థానికి పేరై ఉంటుంది. 'పొన్' శబ్దానికి బంగారు అని అర్థము. 'సంక్రాంతి'ని 'బంగారు కాంతులు' అని వారు వ్యవహరిస్తారు. ఆ సూర్యుని 'హిరణ్మయునిగా' గణించటం వైదికము. వారు 'తైపొంగల్' అంటారు. తై (మాఘం) నెలలో సంక్రాంతి రావటం దీనికి కారణము.
తమిళ దేశంలో పూజాగృహాలలో చక్రాకృతిగా సూర్యుని సంజ్ఞను ఏర్పరచి ఆయన్ను నారాయణస్వరూపుణ్ణిగా పూజిస్తారట. కొత్త పంటలు రావటమూ, దానికి సూర్యుడు కారకుడని భావించటమూ దీని తాత్పర్యార్థంగా వారిలోనూ కనిపిస్తుంది. 'పొంగల్' పండుగ మర్నాటి దినాన్ని తమిళులు 'మాట్టు పొంగల్' అంటారు. అంటే పశువుల పండుగ. వారి పంటకు కారణం అయిన పశువులను వారు పూజిస్తారు. వాటికి స్నానం చేయించి పసుపుకుంకుమలతో అలంకరించి పూజ చేసి హారతులిచ్చి గోవుల పాటలు, నంది పాటలూ పాడుతారు. తెలుగు దేశంలోనూ నందిపాటలు 'వీథి వీథులంట విడువరమ్మ మా నందినీ శివనందినీ' ఇత్యాదులు - వినిపిస్తుంటవి. 'రాగల్లుదున్న' పాట ఇటువంటిదే. సంక్రాంతికి తమిళదేశంలో కృషీవలుడు 'కోడె పందాలు' వేస్తుంటాడు. బాగా మేపి పందాలు కట్టి తవెటు, డోళ్ళు, మద్దెలలతో ఉత్సాహాలు కల్పించి కోడెలను పోట్లాడిస్తారు. ఇవి చూచి తీరవలసినవి. 'మాట్టు పొంగల్' పండుగలో 'జల్లికట్టు' చాలా ప్రళయంగా ఉంటుంది. కొంత ధనం సంచిలో పోసి మదించిన కోడె కొమ్ముకు కట్టి దానిని వశపరచుకున్న వాళ్ళకు దానిని బహుమతిగా ఇస్తారు. ఇందుకోసం అనేకులు బలశాలురు వచ్చి గాయాలకూ, రక్తస్రావాలకు ఓర్చి, పశువులను లొంగదీసి బహుమతులు పుచ్చుకుంటారు. సంక్రాంతినాడు ఆంధ్ర గ్రామాల్లో కోడిపందాలు జరుపుకోవడం తెలిసిందే.
'ఆంధ్ర'లో 'కోడిపందాలు’
పొంగలి పండుగ మూడవనాడు తమిళ దేశంలో 'కన్నెల పాటలు' స్త్రీలు పాడుతారు. ఇందులో ముఖ్యంగా కన్యలు పాల్గొంటారు. మూడవదినం ఉదయమే