దక్షిణదేశంలో బొమ్మల కొలువు మహావైభవంతో జరుగుతుంది. మేల్కట్టులతో ప్రతిమామంటపాన్ని అలంకరించి వింత వింతగా బొమ్మల కొలువులు తీరుస్తారు. బాలికలూ, యువతులూ, అలంకరణం చేసుకొని వీథులు కళకళలాడేటట్లు పేరంటపు కొలువులతో ఈ దినాల్లో కాలం వెళ్ళబుచ్చుతారు.
యోగ్యమైన అధికారం కలిగి యజ్ఞశాలానిర్మాణం చేసి, విధులు తెలుసుకొని దేవీవ్రతం చేయవలసి ఉంటుందని శిల్పగ్రంథాలు పలుకుతున్నవి. హరిహరాదులైన లోక పాలకులందరూ దేవీపూజాతత్పరులేనట. ఈ నవరాత్రి విధానాలకు సంబంధించిన దేవీపూజావిశేషాలు సంప్రదాయ గమ్యాలు. ఒకరి సంప్రదాయాన్ని మరొకరు గ్రహించటం కూడా పాపహేతు వట!
ఇక్కడ దేవీ స్వరూపాన్ని కొంతగా సంగ్రహించవలసి ఉన్నది. ప్రపంచము సమస్తమూ ప్రకృతిమయము. ప్రకృతి స్త్రీమూర్తి. ఆదిశక్తి. ఈమెవల్లనే ప్రపంచానికి సృష్టిస్థితి లయాలు ఏర్పడుతున్నవి. సృష్టి స్థితిలయాలకు కారణభూతులైన దేవతల్లో నానానామాలను ధరించి శక్తి ప్రకాశిస్తున్నది. బ్రాహ్మి, వైష్ణవి, గౌరి, వారాహి, నారసింహి ఇత్యాది నామాలతో భాసించే తల్లి పరాశక్తి. అందువల్లనే 'సర్వచైతన్య రూపాంతాం, ఆద్యాం విద్యాం చ ధీమహి, బుద్దిం యానః ప్రచోదయాత్' అనే దేవీ గాయత్రి. ఈ అర్థాన్నే దేవీ భాగవతము 'జగములు సృజింప రాజసీ శక్తియగుచు, జగములు భరింప సాత్వికీశక్తి యగుచు, జగము లణపంగ దామసీ శక్తియగుచు, నిన్ను నన్నును హరుని దానిల్పైనంబ' అని పల్కింది.
అంబిక, హైమవతి, కాత్యాయని, సతి, దుర్గ, భద్రకాళి, కాళరాత్రి, చండి మొదలైన నామాలలో ఉన్న రూపాలన్నీ ఆదిశక్తి స్వరూప భేదాలే. అంబికా నామము. శ్రుతులలోనూ, ఉమా, హైమవతీ, దుర్గాదులు ఉపనిషత్తులలోనూ కనిపిస్తున్నవి. ప్రకృతి స్త్రీరూపిణి కావటం వల్ల శాక్తేయులు పెక్కుశక్తులను పూజించే బదులు కేవలం స్త్రీని పూజిస్తారు.
బృహన్నందికేశ్వర పురాణంలోని దుర్గాపూజాపద్ధతిలో సర్పతోభద్రమున నవావరణాలలో 'గుండీ' ననుసరించి పూజాలంకరణం చేసి, విశిష్ట కేతనాలతో జల కలశాలు నిలిపి కోటియోగినీదేవతలను పూజించవలెనని ఉన్నది. కళాకర్మకు సంబంధించిన మయదీపికలో దేవీమూర్త్యంతరాల స్వరూప లక్షణాలు చిత్రితాలై ఉన్నవి. తంత్ర గ్రంథాలను బట్టి ఆదిశక్తి కోటియోగినీరూపాలలో ఇవి ప్రధానాలుగా కనిపిస్తున్నవి. ఇందు కొన్ని సౌమ్యమూర్తులు, కొన్ని అసౌమ్యమూర్తులు. వికృత,సంస్కృతి 335