పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/333

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆవాహనచేసి పూజిస్తారు. దుర్గా రూపమునూ 'శమీ శమయతే పాపం శమీ శత్రువినాశనీ' అని ప్రతిష్ఠ వహించిన జమ్మి చెట్టు మొదట మన్ను త్రవ్వి నీరుపోసి, అక్షతలు గలిపి తిరిగి వచ్చేటప్పుడు శిరస్సుమీద ధరించి రావటము ఆచారము. పరసీమలో శత్రువుల బొమ్మలనుంచి ధనుష్టంకారం చేసి వాటి హృదయసీమల్లో అమ్ములు నాటి, జమ్మి దాకి నెత్తిమీద ఉంచుకొని తిరిగి వచ్చి విద్వదోష్ఠీలోలు రయ్యేవారు పూర్వపు రారాజులు. పాండవుల అజ్ఞాత వాసారంభదశలో ఆయుధాలను కట్టకట్టి మత్స్యపుర ప్రేతభూమిలో ఉన్న జమ్మిమీద ఉంచి వెళ్ళిపోయిన తరువాత, ఉత్తర గోగ్రహణ సందర్భంలో అర్జునుడు గాండీవాన్ని స్వీకరించి విజయాన్ని పొందాడు. (రుద్రుడికి శ్మశాన భూమి విహారస్థానము. ఆయన ఈశాన్యదిశ కధిపతి. అందువల్లనే శ్మశానాలు గ్రామాలకు ఈశాన్య దిశకు చేరువగా ఉంటవి) విజయదశమి నాడు అర్జునుడు శత్రువిజయం చేయటం వల్ల విజయదశమి మహోత్సవాన్ని క్షత్రియులు మహోల్లాసంతో జరిగించేవారు.

నవరాత్రి ఉత్సవాలు చిరకాలం నుంచీ జరుగుతున్నవి. ఒక్కొక్క దేశంలో ఒకవిధంగా నడుస్తున్నవి. అందులోని ఆచార వ్యవహారాలకూ, అర్హమైన సంప్రదాయానికీ అనంతవైవిధ్యం గోచరిస్తున్నది. దేవీ స్వరూపాలు భిన్నభిన్నాలైనట్లే పూజావిధానాలు కూడా భిన్నభిన్నంగా ఉన్నవి.

దేవీపూజకు సప్తవిధాలైన కల్పాలున్నవి: 1. నవ్యమాది కల్పము 2. ప్రతిపదాది కల్పము 3. షష్ట్యాది కల్పము 4. సప్తమ్యాది కల్పము 5. అష్టమ్యాది కల్పము 5. అష్టమీ కల్పము 7. నవమీ కల్పము. సామాన్యులైనవారు సప్తమ్యాది కల్పాన్నీ, సంపన్నులైనవారు ప్రతిపదాది కల్పాన్నీ అనుసరించి దేవీపూజ చేస్తారు.

ప్రతిపదాది కల్పాన్ని అనుసరించి ఆశ్వయుజ శుద్ధ ప్రతిపత్తునాడు ప్రతిమా కలశస్థాపనాదులు జరిగించి దేవికి కేశసంస్కారాది ద్రవ్యాలను చేకూర్చుతారు. విదియనాడు కేశబంధనం జరుగుతుంది. తదియనాడు దేవికి దర్పణాన్ని అర్పించటమూ, సిందూరము, లత్తుక మొదలైన అలంకరణ ద్రవ్యాలను సమర్పించటమూ జరుగుతాయి. చవితినాడు మధుపర్క సమర్పణమూ, నేత్రాలంకరణమూ చేయవలె. షష్ఠినాడు సాయంసమయంలో బిల్వతరు బోధనము జరుగుతుంది. దేవతలకు దక్షిణాయనం రాత్రి కనుక నిద్రించు దేవిని మేల్కొల్పటమే బోధనము. సప్తమినాడు స్వగృహంలో పూజ, క్రితం దినం షోడశోపచారపూజ జరుగుతుంది. కనుక షష్ఠిని ఉపవాసము, అష్టశక్తి పూజ, నవమినాడు ఉగ్రచండాది దేవీపూజ, బలిదానాదులూ, కుమారీ పూజసంస్కృతి 333