రంజింపజేసేవారట. స్త్రీ పాత్రలను స్త్రీలే ధరించినట్లు తెలుస్తున్నది. ప్రత్యేకమైన నాట్య ప్రదర్శనాలు కూడా విజయరాఘవుని కాలంలో కొలువులో జరిగేవి. అతడు అంకితం పొందిన రాజశేఖరవిలాసంలో చుండి కాళయ అతని సభలో ఖ్యాతి పొందిన నర్తకీమణుల ప్రత్యేకతలను గురించి -
సీ. “చౌపదంబులు సీత రూపవతీ కాంత
శబ్దచూడామణి చంపకాఖ్య,
చెలువగు జక్కిణి చెలువ మూర్తి వధూటి
కొదమ కోమలవల్లి గురునితంబ
నవపదంబులు లోకనాయికా లోలాక్షి
యలదేశి శశిరేఖికాబ్జనయన,
తురు పదంబులు రత్నగిరి నితంబినియును
పేరణివిధము భాగీరథియును
తే. మదన ప్రదద్యూత నవరత్నమాలికాది
బహువిధాలక్ష్య నాట్య ప్రపంచమెల్ల
ఘనత కెక్కిన తక్కిన కాంతలెల్ల
నభినయించిరి తమ నేర్పు లతిశయిల్ల.”
అని వ్రాసి ఉన్నాడు. పదకవితా చక్రవర్తి క్షేత్రయ్య విజయరాఘవుని రాజ్యకాలంలోనే దక్షిణ యాత్ర జేసి 4000 పైగా (మేరునిఘంటువు లెక్క ప్రకారము) మధుర భక్తి ప్రపూరితాలైన పదాలను గానం చేశాడు. గేయకవితా ప్రపంచంలో పాత్రవైవిధ్యానికీ, పరిస్ఫుట రూప చిత్రణానికీ, భావవ్యక్తీకరణానికీ క్షేత్రయ్యకు సాటి నిలువగలవాడు లేడు. ఇతని పదాలలో మగబొమ్మలు సూటిగా మన కంటిముందు కనపడరు. వారి నాడించు సూత్రధారిణులు స్త్రీలు. స్త్రీ స్వభావము నందలి వైవిధ్యమును, అంద చందాలనూ, ఇంత సుకుమారంగా, గంభీరంగా త్రచ్చి చూచినవాడు లేడు. 'మగువ ఏకాంత మందిరము వెడలెన్' అన్న వనితాదివ్య సౌందర్య నిరూపణం మొదలు ఆహిరి చాపుతాళములో వ్రాసిన 'పచ్చి ఒడలిదానరా, పాపడు పదినెలలవాడు వచ్చి కూడుటకు వేళ గాదు' అన్నంత వరకూ ఆయన లేఖినికి విహారభూమి. మధుర చొక్కనాథుడూ, తొండైమాన్ రఘునాథరాజూ విజయ రాఘవునితో కీర్తిస్పర్ధ వహించి సంగీత నాట్యాలను పోషించారు. చొక్కనాథుని ఆస్థానకవి తిరుమలుడు 'చిత్ర కూటాచల మాహాత్మ్య' యక్షగానాన్నీ, మైసూరు సంస్థానాధిపతి చిక్క దేవరాయనిమీద ఒక కవివావిలాల సోమయాజులు సాహిత్యం-4