పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/326

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పితామహుడు పెద్దన్న 'మధురకిన్నరీ నిక్వాణంబుల రాణం ద్రాణచెరచు లక్ష్మీ నారాయణ కల్యాణంబు పాటలం దీటకొను తిన్నని రవంబు' అని వాటికి స్థానమిచ్చాడు.

రాయల ప్రాపకం క్రింద కొన్ని సంగీతలక్షణ గ్రంథాలు జన్మించినవి. వాటిలో లక్ష్మణభట్టు 'సంగీత సూర్యోదయము' ప్రసిద్ధమైనది. లక్ష్మణభట్టు కర్ణాటక సంగీతాన్ని జన్య జనకరాగవిభాగం చేసి నిరూపించటానికి ప్రారంభించినవారిలో మొదటివాడని చెప్పవచ్చును! 'కామ దేవవిలాస' మనే సంగీత నాట్య శాస్త్రగ్రంథ మొకటి ఈ కాలంలో జన్మించినదని తెలుస్తున్నది. అళియరామరాజు సంగీత కళాభిమాని. బియకారం రామయామాత్యుని 'స్వరమేళకళానిధి' ఆయన కాలంలో జన్మించిన అత్యుత్తమ సంగీత శాస్త్ర గ్రంథము.

తళ్ళికోట యుద్ధానంతరము విజయనగర సామ్రాజ్యలక్ష్మి పెనుగొండ, చంద్రగిరులకు చేరింది. కానీ ప్రభువుల కళాభిమానం వారిని పరిత్యజించ లేదు. పెనుగొండ రాజులలో తిరుమల రాయలు భట్టుమూర్తికి ఆశ్రయుడు. కృత్యాదిలో భట్టుమూర్తి 'సంగీతకళారహస్యనిధి' నని చెప్పుకున్నాడు. ఆయన 'లలనా జనాపాంగ’ వంటి ఛందోబద్ధలయ ప్రధానాలయిన పద్యాలనే కాకుండా, వచనాలను కూడా శిష్టు కృష్ణమూర్తిశాస్త్రులవారి వంటి ప్రసిద్ధ విద్వాంసులు వీణ మీద పలికించినట్లు వినికిడి. వసుచరిత్రలో ఒకచోట 'హారముల్ కుఱుచలు త్రొక్క' అనే ప్రయోగం కనిపిస్తున్నది. దీనికి శబ్ద రత్నాకరకారులు ఒక నాట్య విశేషమని వ్రాసి ఉన్నారు. ఈ ప్రాంతములో గోదావరీ పరిప్రాంత నివాసి సోమనాథ పండితుడు ఒక సంగీత శాస్త్రాన్ని రచించినట్లును, అది తరువాత ఖిలమై పోయినట్లును సంగీత సారామృతాదిశాస్త్ర గ్రంథాల వల్ల తెలుస్తున్నది. ఇతడు స్వరాలు 15 మేళ కర్తలుగ నిశ్చయించినాడట. తిరుమల రాయలు గీత గోవిందంమీద ఒక వ్యాఖ్యానాన్ని అంకితం పుచ్చుకున్నాడు.

విజయనగర పతనానంతరం ఆంధ్రకళాకోవిదులూ, శాస్త్రజ్ఞులూ దక్షిణదేశానికి వలసవెళ్ళినారు. అక్కడ తంజాపురము రఘునాథరాయలు విశేషంగా కళాపోషణం చేశాడు. ఆయన కవి, గాయకుడు, శాస్త్రజ్ఞుడు. ఇతడు సంగీత నాట్యాల రెంటియెడా సమానత్వం వహించి సంగీతసుధ, భరతసుధ అనే రెండు ఉత్తమశాస్త్ర గ్రంథాలను రచించినట్లు తెలుస్తున్నది. సంగీతసుధ మొదట రఘునాథరాయలు 7 అధ్యాయాల గ్రంథంగా వ్రాసినాడట. నేడు 4 అధ్యాయాలు మాత్రమే కనిపిస్తున్నవి. ఈ గ్రంథంలో రాయలు 50 రాగాలను 15 మేళకర్తలుగ విభజించినాడు. ప్రాచీన శాస్త్ర గ్రంథాలలో రాగాలకు అంస, న్యాస, గ్రహాలు మాత్రమే కనిపిస్తవి. ఇతడు శ్రుతి, స్వర అలప్తికలను326 వావిలాల సోమయాజులు సాహిత్యం-4