ప్రభాతాయాతవాతాహతిన్, లోలత్తంత్రుల మేళవింపగదవే లోలాక్షి దేశాక్షికిన్' అన్న వాక్యాలవల్ల తెలుస్తున్నది. ఆనాటి జనసామాన్యరసికలోకానికి ఈ రాగవిభేదాలు తప్పకుండా తెలిసి ఉంటవని మనం నిశ్చయించవచ్చును. రాధామాధవకవి ఈ విషయాన్నే 'కొలదిగ రాగ భేదములకున్ దగు సారెలు సారెకొత్తి తంత్రులు కొనగోళ్ళ మీటుచు జనుంగవ దండె యమర్చి కృష్ణ లీలలు ప్రకటించి పంచమకలశ్రుతి మాకు లిగుర్ప రాధకున్ వలపులు చిల్కగన్ మధురవాణి ప్రవీణత బాడె వీణతోన్' అని పలికినాడు. వీణా వాదనమూ, అభ్యసనమూ సర్వసామాన్యంగా ఆ నాడున్నట్లు గోచరిస్తుంది. లేకపోతే రాయలు ఆముక్తమాల్యదలో -
ఉ. "వేవిన మేడపై వలభి వేణిక జంట వహించి విప్పగా
బూవులు గోట మీటుతరి పోయెడు తేటుల మ్రోత లేమి శం
కావహమౌ గృతాభ్యసన లౌటను దంతపు మెట్లవెంబడిన్
జే వడి వీణ మీటుటలు చిక్కెడ లించుటలున్ సరింబడన్.” (ఆ1. ప. 62.)
అన్న పద్యంలోని భావాభినివేశానికి వీలుంటుందా? రాయల పాలనకాలంలో 'నాట్యకళ' అత్యుత్తమ స్థితి పొందినది చెప్పటానికి రామాలయ శిల్పాలు నిదర్శనాలు. మనుచరిత్రలో ఒకచోట పలికిన -
చ. 'చిలుకల కొల్కి కల్కి యొక చేడియ నాటకశాల మేడపై
నిలువున నాడుచుండి, ధరణీపతి చూడదలంచి యంచునన్
నిలచి రహిం గనుంగొనుచు నెయ్యమునన్ దనువల్లి యుబ్బి కం
చెల తెగబడ్డ కేతనము చీర చెరంగున మూసెఁ జన్నులన్.'
అన్న పద్యంవల్ల ప్రత్యేకంగా ఆ నాడు ఆంధ్రదేశంలో నర్తనశాల లున్నట్లు వ్యక్తమౌతున్నది. ఇక్కడ 'కంచెల' శబ్దానికి నాట్యం చేసేటప్పుడు బిగుతు కోసం తొడుగుకునే చనుకట్టు అని బ్రౌను అర్థము చెప్పినాడు. రాయలు ప్రజావినోదార్థము తోలుబొమ్మ లాటగాండ్రను రావించి, వారిమీద కాళన మంత్రిని అధికారిగా నియమించి గ్రామసీమల్లో వారిచేత ప్రదర్శనలు చేయించేవాడట. ఇతని కాలంలోనే మొట్టమొదటి 'కొరవంజి'కి ఆదరం లభించినట్లు అయ్యల రాజు రామభద్రుని 'జక్కిణీ, కొరవంజి వేషముల కేళి సల్పిరి, దేవతానటీమణులకు బొమ్మవెట్టు క్రియ' అనే ప్రయోగం వల్ల వ్యక్తమౌతున్నది. పదకవితాపితామహుడు, తాళ్ళపాక పెదతిరుమ లార్యుడు రాయలకు సమకాలికుడు. పదకవితకు ప్రాపకం లభించింది. కవితాసంస్కృతి 325