పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/322

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నలవడియె మొగిలు తెరలును, బొలుపగు వడగండ్లగములు పుష్పాంజలులున్' అని నాట్యపూర్వరంగాన్ని ఉద్ఘాటించాడు. ప్రోలయ వేమారెడ్డి కుమారుడు అనవేమారెడ్డి కంచి, రన్ని, పొన్ని అనే ముగ్గురు నాట్యశాస్త్రాభిజ్ఞుల పోషించినట్లు తెలుస్తున్నది. కొండవీటి రెడ్డి రాజులలో ఒకడైన కుమారగిరిరెడ్డి వసంత రాజీయ మనే నాట్యశాస్త్రాన్ని ఒకదానిని వ్రాసి దానిని శిష్య అయిన లకుమాదేవి మూలాన ప్రచారం చేయించినట్లు -

"జయతి మహిమా లోకాతీతః కుమారగిరి ప్రభో
సృదసి లకుమాదేవీ యస్య ప్రియాసదృశీ ప్రియా |
నవ మభినయం నాట్యార్థానాం తనోతి సహస్రధా
వితరతి బహూ నర్థా నర్థివ్రజాయ సహస్రశః ||”

అన్న శ్లోకం వల్ల వ్యక్తమౌతున్నది. కుమారగిరి రెడ్డికి వసంతరాజు బిరుదనామము, అతని వసంతోత్సవ ప్రియత్వం వల్ల కలిగింది. ఇతని బావమరిది కాటయ వేమన శాకుంతల వ్యాఖ్యలో కుమారగిరి నాట్యశాస్త్రాన్ని గురించి 'మునీనాం భరతాదీనాం చ భూభుజాం, శాస్త్రాణి సమ్య గాలోచ్య నాట్య వేదార్థవేదినాం, ప్రోక్తం వసంతరాజేన కుమారగిరి భూభుజాం, నామ్నా వసంతరాజీయం నాట్యశాస్త్రం యదుత్త మమ్' అని వ్రాసి ఉన్నాడు. కుమారగిరి తరువాత కొండవీటిని పాలించిన పెదకోమటి దత్తిలమతాన్ని ఆధారం చేసికొని ఒక నాట్యశాస్త్రాన్ని వ్రాసినట్లు తెలుస్తున్నది. కొండవీటి రెడ్డిరాజ్యం అంతరించిన తరువాత శ్రీనాథ మహాకవి రాజమహేంద్రవరం రెడ్లను ఆశ్రయించాడు. ఈ మహాకవిగ్రంథాలలో అనేక సందర్భాలలో సంగీత నాట్య ప్రశంసలు కనిపిస్తున్నవి. 'వల్లకి చక్కి కాహళము వంశము ఢక్క హుడక్క ఝర్జరుల్, ఝల్లరి యాదిగా గలుగు శబ్ద పరంపర తాళశబ్దమై, యుల్లసిలం బ్రబంధముల కొప్పుగ నాడుదు రగ్రవేదిపై, బల్లవపాణు లీశ్వరుని పంటమహీశులు పూజసేయగన్ హిందోళంబున బాడి రచ్చరలు భీమేశున్ త్రిలోకాధిపున్ - భీమఖండము పాడిరంగనల్ దేశ విధంబు మార్గమున తేటయు నొక్కట సాళగింపగన్ - నైషధము; బెండపూడి యన్నయామాత్యుండు కట్టించిన మొగసాలవాకిటి మహోత్సవ మంటపమునందు, పేరోలగంబుండి '... కుండలీ, దండలాసక, ప్రేరణ, సింధు, కందుక, ధమాళీ, చేలమతల్లికా, హల్లీసకాది నృత్యంబుల నవలోకింపుచు మేలంబు లాలకించుచు, జంపూచాటునాట కోదాహరణజయఘోషచక్రవాళ చతుర్భద్ర చతురాత్రి ప్రబంధంబు లాకర్ణించుచు' మొదలైన సంగీత నాట్య సంబంధములైన రచనలు శ్రీనాథ మహాకవి గ్రంథాలలో విశేషంగా కనిపిస్తున్నవి.322 వావిలాల సోమయాజులు సాహిత్యం-4