తే. మారుపట్టాభిషేకాఖ్య వారికుంభి
చిత్తజుని కోట లగ్గ దంచనపు గుండు”
అనఁగ కాంతి నిస్తంద్రుఁ డగుచు నానాఁటి కభివృద్ధి నారుకొనుచుఁ గన్పట్టినాఁడు. [1]'విరహుల కెల్ల సంధ్యవతి వేడుక జోతము సెప్పవచ్చుచో నిరతము తోడ నక్షతలు నించి తగన్ గరపంకజంబునన్ మురియుచుఁ బట్టు నా మెఱుఁగు ముత్తెఁపుఁ జిప్పన' నొప్పు విదియచంద్రు నొక కవిరాజు గమనించినాఁడు. జాబిల్లి యొకానొక [2]యద్యతనాంధ్ర కవి కుమారున 'కాకాశపు టెడారిలోఁ గాళ్లు తెగిన యొంటరి యొంటె' వలెఁ గన్పించినాఁడు. మిన్నువ్రాకు శీతరోచినిఁ జూచియొక భావుకుఁ డమృతసముద్రములోని పీయూషమును జేదుకొనుచున్న దివ్యాంగన లుపయోగించు వెండి చేరులకుఁ (కిరణములు) గట్టఁబడిన స్పటికకుంభముగఁ గనుఁగొనినాఁడు.
ఒక మహాకవి చూచుచుండ :
చ. [3]దిన పరిణామ లక్ష్మికిఁ బ్రతీచి తగం గయి సేయు వేడుక
స్వనరుహమిత్రబింబ మను వర్తులలాక్షికపట్టికం బయో
ధి నడుమఁదోఁచి సాంధ్యనవ దీప్తిరసంబు హరించి పాఱవై
చిన వెలిదూదియో యనఁగ శీతకరుం డుదయించె నత్తఱిన్.”
[4]కాలమనియెడు విలాసి కెంపులతోను ముత్యములతోను నొక సరమును గ్రుచ్చుచుండ సాంధ్యకిరణవిశిష్టుఁడైన సూర్యుఁడు సూత్రమునఁ గ్రుచ్చఁబడిన కెంపు వలె నుండ వరుస తప్పుటచేఁ ద్రోచి పిఱుందఁ జేర్చు ముత్తెము క్రియ లాంఛన రంధ్రసంగతిచే నయ్యమృతదీధితి యా మహనీయునకు మఱల నొకమాఱు దర్శన మొసఁగెను.
భక్తశిఖామణి యగు నొక మహాకవిప్రౌఢునకు -
మ. [5]ఉదయ గ్రావము పానవట్ట మభిషే కోదప్రవాహంబు వా
ర్ధి దరద్ధ్వాంతము ధూపధూమముజ్వ లద్దీపప్రభారాశి కౌ
ముది తారానివహంబు లర్చిత సుమంబుల్గాఁ దమోదూరసౌ
ఖ్యదమై శీతగభస్తి బింబ శివలింగం బొప్పెఁ బ్రాచీదిశన్.”
- ↑ విరహుల కెల్ల సంధ్యవతి - ప్రబంధ రత్నా. 581
- ↑ అద్యతనాంధ్ర కవి కుమారుఁడు - శ్రీ శ్రీ
- ↑ దినపరిణామలక్ష్మి - పారిజా. ఆ. 2, ప. 44
- ↑ కాల మనియెడి పారిజా. ఆ. 2. ప. 43
- ↑ ఉదయగ్రావము - ధూర్జటి కాళహస్తీ... ఆ. 2. ప. 232
____________________________________________________________________________________________________
32
వావిలాల సోమయాజులు సాహిత్యం-4