పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/31

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
సీ. [1]కెరలి చీఁకటిమ్రాను గెడపంగ నిక్కిన
            సమయగజంబుదంతము లనంగఁ
     జదలు గేదఁగి తూర్పుతుదకొమ్మ నరవిరి
            యై కానిపించు పూరేకు లనఁగఁ
     బొడుపుగుబ్బలి నెలపురిటింటి యిడుపునఁ
             జఱచిన గందంపుఁ జట్ట లనఁగ
     మరుని ముందఱ బరాబరిసేయు కంచుకి
             కులముచేతుల వెండిగుదె లనంగఁ

తే. గైరవములకు వెన్నెల నీరు వఱపఁ
     బూని చేర్చిన పటికంపు దోను లనఁగఁ
     గ్రమముతో శీతకరమయూఖములు గగన
     భాగమునఁ గొన్ని యల్లనఁ బ్రాకుదెంచె.'

నని వర్ణించియున్నాఁడు.

మఱియొక మహాకవి యుదయకాల చంద్రకాంతిని 'యభినవ ఖరయోషి త్కషాయకంఠకాంతి' తో నుపమించినాఁడు. బాలచంద్రునిఁ బ్రాక్సతీలలాటతిలకముగ నొకరు, నభస్సీమంతినీ సిందూరరేఖగ నొకరు దర్శింప, నొక రప్సరఃప్రణయినీ కరసరోజచషకముగను, మఱియొకరు కబరీచ్యుత మాలగను జూచినారు. ఒక రత్రిమునిలోచన భూషికగా భావించినారు. ఒకరు త్రినయన జటావల్లీ పుష్పముగ నూహించినారు.

శుక్లపక్ష క్షపాకరుఁడొక సురుచిరుని మనోవీథి -

సీ. [2]"మన్మథదివ్యాగమమున కోంకారంబు
             భూ తేశు నౌదల పువ్వుదండ
     యల్పశృంగార రేఖార్గళకుంచిక
             యధికతమోదంతి కంకుశంబు
     విరహిణీజనమర్మవిచ్ఛేదకర్తరి
             యంబర క్రీడ దంష్ట్రాంకురంబు
     తారకామౌక్తిక తతికినంచితశుక్తి
             దగు నంబునిధికి ముత్యాలజోగు

  1. కెరలి చీఁకటిమ్రాను - తిమ్మన పారిజా. ఆ. 2, ప. 36
  2. మన్మథ దివ్యాగమమున – మహాకవి పెద్దపాఁటి యెఱ్ఱన కుమార నైషధములోనిది
    (ప్రబంధ రత్నా. 84).

____________________________________________________________________________________________________

మణిప్రవాళము

31