సంగీతంతోపాటే నాట్యం కూడాను. దేవతా ప్రీతికోసం సామగానం చేసేటప్పుడు నృత్య, గీత, వాద్యాలు మూడూ కలిసి ఏర్పడే తౌర్యత్రికము (Symphony - Union of Song, Dance, and Instrumental music) కలిగితే గాని రసనిష్పత్తి కలగదని ప్రాచీనుల అభిప్రాయము.
భరతశాస్త్రం మీద వ్యాఖ్యానం వ్రాసిన తిక్కాకర, అభినవగుప్తపాదులిద్దరూ భరతాచార్యుల వారికి పూర్వమే భరత శాస్త్రాన్ని గురించి కాశ్యప విశాఖాది ఆచార్యులు ప్రవచించినట్లు వ్రాసి ఉన్నారు. వారి గ్రంథాలు కాలగర్భంలో కలిసిపోవటం కారణంగా భరతర్షి ఈ శాస్త్రాన్ని నిబంధించి క్రమమార్గంలో లోకంలో ప్రచారం చేయవలసి వచ్చింది.
భరతాచార్యులవారి నాటికే ఆంధ్రులు గాంధర్వ విద్యాప్రవీణులనీ, నాట్యశాస్త్రకోవిదులనీ తెలుస్తున్నది. ఈ ఆచార్య మహాశయుడు 13వ అధ్యాయంలో (1) అవంతీ (2) దాక్షిణాత్య (3) పాంచాలీ (4) మాగధీరీతులని నాట్యాన్ని విభజించి దక్షిణ దేశానికి ఎల్లలు చెపుతూ 'దక్షిణసముద్ర వింధ్యమధ్య దేశమ్' అన్నాడు. ఆయన మతంలో కోసలులు, కళింగులు, ద్రావిడులు, ఆంధ్రులు, మహారాష్ట్రులు, దాక్షిణాత్యులు. వీరు బహునృత్యగీతాభిమానులట! చతుర మధుర లలితాంగాభినయులట!
ఆంధ్రజాతి ఏకచ్ఛత్రాధిపత్యం క్రిందకు వచ్చి కళాప్రియంభావుకమైనది, ప్రప్రథమంలో శాతవాహన రాజుల కాలంలోనే. ఈ రాజవంశం కంటే ప్రాచీనము లనిపించుకున్న జగ్గయ్యపేట, భట్టిప్రోలు మొదలైన కొన్ని ప్రదేశాల్లోని శిల్ప ఖండాలను పరిశీలిస్తే, ఆ నాటికే ఆంధ్రులు సంగీత నాట్యశాస్త్రాలలో అందెవేసిన చేతులని అవగతమౌతుంది. శాతవాహన రాజులలో మూడవవాడు కృష్ణుడు. జగత్ప్రశస్తి గన్న సాంచీ స్తూప స్తంభంమీద ఇతని ప్రాకృత శాసనం ఒకటి కనిపిస్తున్నది. సాంచీ శిల్పాలలో కొన్ని ఆంధ్రులవి. వాటిలోని నాట్యభంగిమలూ, జంత్రవాద్య సమ్మేళన చిత్రములూ శాతవాహనులనాటి ప్రాథమిక స్థితిలోని ఆంధ్రుల సంగీత నాట్యవైభవాన్ని ఊహించటానికి చక్కని ఉదాహరణాలు. కొంత కాలానికి పాత వాహనరాజులు యావద్భారతాన్నీ కైవసం చేసుకొని మగధ రాజధానిగా రాజ్యపాలనం చేశారు. వారిలో ప్రసిద్ధుడు హాలమహారాజు గాథాసప్తశతీ సంగ్రథిత, 'బృహత్కథ' కర్త గుణాఢ్య పండితుడు, కామసూత్ర కర్త వాత్స్యాయన మహర్షి ఈ కాలంవారు. గాథాసప్తశతిలో అనేక గాథలు ఆ నాటి ఆంధ్రుల సంగీత, నాట్య, చిత్రలేఖనాది కళాప్రియత్వాన్ని వెల్లడి చేస్తున్నవి. మహర్షి వాత్స్యాయనుడు కామ సూత్రాలలో అనేక సందర్భాలలో