పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/311

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్రులు - సంగీత నాట్యాలు

‘దేవానా మీద మామనంతి మునయః
కాన్తమ్ క్రతుమ్ చాక్షుషమ్'. - మాళవికాగ్ని మిత్రము

'Music is a moral law, it gives a soul to the Universe, wings to the mind, flight to the imagination, a charm to sadness, gaiety and life to everything. - Plato

భారతజాతివలెనే దాని సంగీత నాట్యకళలూ అతి ప్రాచీనాలు. వేదకాలం నాటికే మనకు సంగీత నాట్యాలతో నిరుపమానమైన పరిచయం ఉన్నట్లు స్పష్టమౌతున్నది. నేటి పురాతత్త్వవేత్త మొహంజోదారో, హరప్పాలలోని చరిత్రాత్మక పరిశోధనల మూలంగా ఈ రెండు కళలూ ప్రాగ్వైదికయుగంలోనే భారతదేశంలో విశేష వ్యాప్తి పొందినట్లు వ్యక్తమౌతున్నది. వేదవాఙ్మయంలోని యమయమీ ఊర్వశీపురూరవాది సంభాషణలు ప్రాచీన భారతీయ వాకోవాక్య సంపత్తికి (Dialogue) ప్రబల నిదర్శనాలు. శిక్షాస్మృతులలో కొందరు దేవతలను ఆరాధించేటప్పుడు గృహస్థు కులపురోహితుడి తోనూ, భార్యతోనూ కలిసి కొన్ని గేయాలు పాడవలెననీ, కొన్ని నాట్యాలు చేయవలెననీ నియమాలు కనిపిస్తున్నవి. గృహస్థూ, పురోహితుడూ పాడుతుంటే యజమానురాలు వీణాతంత్రులు మేళవిస్తూ శ్రుతి కలపవలెనట! అటువంటి వీణను 'పిచోళీ' అని వ్యవహరించేవారట. దీనికే 'ఔదుంబరవీణ' అనే నామం కూడా కనిపిస్తున్నది. ఇది జంత్రవాద్యాల ప్రాథమిక స్థితి అని చెప్పవచ్చును.

సామవేదంలోని 'కృష్ణ'లలోనే సంగీత శాస్త్రంలోని స్వరాలను మనం గుర్తించవచ్చును. నేటి శాస్త్రాని కంతటికీ మూలరూపాలని అనిపించుకోతగిన శుద్ధ, భిన్న, గౌడ, వేసర, సాధారణాలు అనే అయిదు గీతాలూ సామవేదంలోని ప్రస్వర, ఉద్గీత, ప్రతీహార, ఉపద్రవ, నిధానాలలో నుంచి వచ్చినవేనని సంగీత శాస్త్ర పరిశోధకుల అభిప్రాయం. ప్రస్తారం చేసి చూస్తే తదుపరి వ్యాప్తిలో ఉన్న సమస్త రాగాలూ ఈ అయిదింటిలో దేనికో ఒకదానికి చెందుతవి. సామలను స్తోభలంటారు. వాటిని ఉదాత్త, అనుదాత్త, స్వరితాది విభేదాలతో గానం చెయ్యటం మనకందరికీ తెలిసిన విషయమే.