Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/307

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బ్రహ్మ దానికి ద్రష్ట. ఉచ్ఛిష్ట గణపతి దేవతా ఉచ్ఛిష్టాన్ని స్వీకరిస్తాడు. హిందూ దేశంలో హస్తిపకులు ఉచ్ఛిష్టాన్ని భుజించటం కారణమై ఉంటుంది. డుంఠి విఘ్నేశుని రూపాన్ని మహాకవి శ్రీనాథుడు కాశీఖండంలో పేర్కొన్నాడు. చండీ గణేశరూపానికి ఇండోనీషియా, బృహద్భారతం (Greater India) లో అనేక శిలాప్రతిమలు ఉదాహరణాలుగా కనిపిస్తున్నవి.

సామాన్యంగా పుణ్యాహకర్మచేయిస్తూ పురోహితుడు 'యత్పుణ్యం నక్షత్రం, తద్వదకుర్వీతి లోపఘ్యుషమ్, యదావై సూర్య ఉదేతి, అథ నక్షత్రం నైతియావతి తత్ర సూర్యోగచ్ఛేత్, యత్ర జఘన్యం పశ్యేత్, తావత్కుర్వంతి యత్కారస్యాత్ పుణ్యాహ ఏవ కురుతే (తైత్తిరీయ బ్రాహ్మణము 1,5,2,1) అనే మంత్రాన్ని వినిపిస్తాడు. సూర్యోదయ కాలానికి ముందు ఉషఃకాలంలో తూర్పున ఏ నక్షత్రం ఉదయిస్తుందో గమనించి, ఆ నక్షత్రాన్ని పూజించటం భారతీయులకు అనూచానంగా వస్తున్న ఆచారం. ఈ అభిప్రాయాన్నే నిరూపిస్తూ ఋగ్వేద మంత్రం ఒకటి 'ప్రాతర్యవాణా ప్రథమా యజధ్వమ్ నోరనసామయన్తి దేవాయా అజుష్టమ్' (ఋగ్వేదము V 77. 1) ఈ రీతిగా ఉంది. సూర్యోదయానికి పూర్వం తూర్పున ఏ నక్షత్రం ఉదయిస్తే ఆ నాడు ఆ నక్షత్ర సంబంధమైన దేవతను ముందు మనం పూజించాలి. లేకపోతే సూర్యాస్తమయ సమయంలో ఉదయించే నక్షత్ర దేవతనైనా పూజించాలి. అని ఈ మంత్రానికి తాత్పర్యం. భాద్రపదచవితినాడు సూర్యోదయాత్పూర్వం మనకు విఘ్నేశ్వర నక్షత్రం కనిపిస్తుంది. అందువల్ల ఆ నాడు గణపతిని పూజిస్తున్నాము. మర్నాడు ఋషిపంచమి. ఆ కారణం చేత భాద్రపదమాసారంభం నుంచీ విఘ్నేశ్వర నక్షత్రం సప్తర్షుల ప్రక్కన ఉంటాడు. ఈ కారణాలవల్లనే విఘ్నేశ్వరుని జ్యోతిష రూపుడని అష్టోత్తర శతాలు పలకడం.

దేవతలే నక్షత్రాలు.' పాశ్చాత్యులు సప్తర్షి మండలం నాగలి ఆకారంలో ఉంటుందని అన్నారు. గ్రిమాల్డి అనే పాశ్చాత్య ఖగోళ శాస్త్రవేత్త చీనాదేశ నక్షత్రపట్టికలో మూషకరూపం ప్రక్కన సప్తర్షులు ఉన్నట్లు చూపినాడు. సింహం మీదుగా ఒక ఏనుగుతలతో ఉన్న మనుష్యరూపం ఉందిట వాటిలో. అందువల్ల గజముఖుడు, లంబోదరుడూ, మూషకవాహనుడూ అయిన విఘ్నేశ్వరుడు జ్యోతిష రూపుడు. భాద్రపద శుద్ధచవితినాడు ఉదయానికి ముందు ఉదయించిన విఘ్నేశ్వరుడు, చైత్రశుద్ధ చవితినాడు సూర్యాస్తమయ సమయంలో తూర్పున కనిపిస్తాడు. అందువల్ల నేటికీ అస్సాం రాష్ట్రంలోదిగా పరిగణిత మౌతున్న కామరూపంలో, ఆ నాడు విఘ్నేశ్వర