ఉంది. వెనుక పేర్కొన్న కథ కాకుండా మార్కండేయ పురాణంలో విఘ్నేశ్వరుణ్ణి గురించి మరొక కథ కనిపిస్తున్నది. జలానికీ, భూమికీ, రూపం ఉంది కానీ ఆకాశానికి లేదు. ఒక సందర్భంలో శివుడు ఆకాశంవైపు తీక్షంగా చూచాడట! ఆ సమయంలో ఆకాశాన గజాస్యుడు సుందర రూపంతో జన్మించాడు. అతనిమీద పార్వతికే మోహం జనించింది. అతణ్ణి సంహరించటంకోసం శివుడు రుద్రగణాలను సృజించాడు. వారికి ఆయన చెమట బిందువులలో నుంచి జన్మించిన ప్రముఖుడు గజాననుడు అధిపతి అయినాడు. ఆ నాటినుంచీ గణపతి రుద్రగణాలకు అధిపతిగా అభిషిక్తుడైనాడట! శివ పురాణంలో విఘ్నేశ్వరుని బుద్ధి వైశద్యాన్ని తెలియజేసే ఒక కథ చెప్పి ఉంది.
కుమార విఘ్నేశ్వరుల నిద్దరినీ పిలిచి మీలో ముందుగా ఎవరు భూప్రదక్షిణం చేసి వస్తే వారికి వివాహం చేస్తామన్నారు. కుమారుడు మయూరవాహనాన్ని, విఘ్నేశ్వరుడు మూషకవాహనాన్ని అధిరోహించి భూప్రదక్షిణానికని బయలుదేరారు. బుద్ధిమంతుడైన విఘ్నేశ్వరుడు వెంటనే తిరిగివచ్చి తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణం చేసి నా భూప్రదక్షిణమైపోయింది, నాకు వివాహం చెయ్యమని కోరినాడట. అతని తెలివితేటలకు సంతోషించి పార్వతీపరమేశ్వరులు, సిద్ధి, బుద్ధి, నిచ్చి వివాహం చేశారు. ఆయనకు సిద్ధివల్ల క్షేముడు, బుద్దివల్ల లాభుడు అనే ఇద్దరు పుత్రులు జన్మించారు.
గజాననుని ఏకదంతానికి సంబంధించిన క్రింది కథ బ్రహ్మాండపురాణం వల్ల తెలుస్తున్నది. కార్తవీర్యుని సంహరించి పరశురాముడు గురువర్యుడైన శివుని దర్శించటానికి వచ్చిన సందర్భంలో ఆయనకు విఘ్నేశ్వరునితో పోరాటం సంభవించింది. ఆయనను గణపతి తొండంతో పైకియెత్తి ఏడు లోకాలూ చూపించాడు. పరశురాముడు దిగ్భ్రామ చెంది పరశువుతో కొట్టినాడు. గజాస్యుని దంతం ఒకటి నేల మీద పడ్డది. అందువల్ల గణపతి ఏకదంతుడైనాడు.
ముద్గల పురాణంలో గణపతికి ముప్పదిరెండు మూర్తి భేదాలున్నట్లు చెప్పి ఉంది. వాటిలో సిద్ధి వినాయకుడు, సత్య వినాయకుడు, చోరగణేశుడు, మహా గణేశుడు, హేరంబగణేశుడు, హరిద్రగణేశుడు, ఉచ్ఛిష్ట గణపతి మొదలైనవారు ముఖ్యులు. సుదాముడు, మదనావతులకు సంబంధించిన బ్రహ్మాండ పురాణాంతర్గతమైన కథ సత్యవినాయకునికి సంబంధించినది.
జపం చేస్తూ ఉన్న సందర్భంలో జపమాలలోని అక్షాలను లెక్కపెట్టటంలో మోసం చేసినా, మరచిపోయినా లెక్క వేస్తూ పట్టుకొనేవాడు చోర గణపతి.