చిహ్నాలుగా నిశ్చయించి నాగలిమీద అటూ ఇటూ క్రొత్తచేటలు వేసుకొని వస్తూ వున్న రూపము గజముఖాన్ని జ్ఞప్తికి చేస్తుందనీ, అందువల్ల అనాది భావుకుడు విఘ్నేశ్వరుడిని గజాననుడిగా దర్శించి ఉంటాడనీ కొందరు ఊహించారు. ఆయన ఆహారం కూడా క్రొత్తపంటనే తెలియజేస్తూ ఆయన పంట దేవత అని అనటానికి అవకాశం కల్పిస్తున్నది వారి మతం. అన్నీ భాద్రపదమాసానికి సంబంధించినవి. పిండి మోదకాలు, ఇక్షురసం, నారికేళము ఇత్యాదులు. ఆయన లంబోదరం మీద నాగపాశాలు పొలంలో ఉండే ఎలుకలను భక్షించే పాములకు చిహ్నాలని కూడా పైవారు ఊహించారు.
ఈ రీతిగా మానవశాస్త్రజ్ఞులు (Ethnographists) గణేశుని మెక్సికో దేశంలోని ధాన్యదేవతతోనూ, టోంగాద్వీపాలలోని ఆలో ఆలోతోను, గ్రీకుల డిమిటర్, రోమనుల సిరీస్తోనూ పోల్చుకుంటూ వచ్చి, ఆయన లక్షణాలను భాద్రపదమాసం నాటి కర్షక జీవితంలోని అంశాలతో సమన్వయించినారు. సంఘం అభివృద్ధి పొందిన తరువాత తాత్త్వికాభివృద్ధి వల్ల సమస్త సిద్ధి ప్రదాతయై విఘ్నహర్త అయి ఉంటాడని వారు నిశ్చయించినారు.
మనదేశంలో శ్రావణ గౌరిని సాగనంపడంలో గడచిన ఋతువు మృతిని వ్యక్తం చేస్తారు. ఆమెతో బాటు కొన్ని ప్రాంతాల్లో మృద్గణేశుని తిరిగి త్వరగా రమ్మని పంపుతారు. పశ్చిమ భారతదేశంలోని కొన్ని జాతులవారు గణపతిని ‘బొప్పా, మోరియా?' అని వ్యవహరిస్తారు. మహారాష్ట్ర దేశంలో పిల్లలు దానికి 'పుధారియా వర్షీ లౌ కారియా' అనే మాటలను కలిపి గణపతిని త్వరగా తిరిగి రమ్మని వేడుకుంటారు. ఇందులోని మోరియా శబ్దాన్ని సామాన్యకర్షకుడు మోహేరాయా (అందరికంటే త్వరగా రా) అని ఉచ్చరిస్తాడు. ఈ రూపాన్ని తరువాత కాలంలో విద్యాధికులు మరొక విధంగా అర్థం చేసుకొని ఉండటం వల్ల మహారాష్ట్ర దేశంలోనూ, పశ్చిమ భారతంలోని మరికొన్ని ప్రాంతాలలోనూ గణపతిని మయూరేశ్వరుడుగా భావించి, మహాగణపతిని మయూరవాహనుడిగా రూపిస్తూ ఉన్నారు.
గణపతికి సంబంధించిన అనేక కథలు పురాణాల్లో కనిపిస్తున్నవి. బ్రహ్మ వైవర్తపురాణంలో, శివపార్వతులు క్రీడాపరాయణులై ఉన్న సందర్భంలో దేవతలు వచ్చినట్లూ, ఆ సమయంలో శివవీర్యం నేలమీద పడటం వల్ల విఘ్నేశ్వరుడు ఉదయించినట్లు, ఒకానొక కశ్యపశాపం వల్ల అలా ఉదయించిన పుత్రుణ్ణి శివుడు చూడగానే అతని శీర్షం బ్రద్దలు కాగా, దేవతలు పుష్పభద్రనదీ తీరంలో ఉన్న గజము శిరస్సు తీసుకోవచ్చి ఆ బాలునికి అతకటం వల్ల అతడు గజముఖుడైనట్లూ, ఒక కథ