అత్యుత్తమమైన దేవతామూర్తి అనీ, మానవకర్మలకు ఆయన సాక్షీ భూతుడనీ నిరూపితమైంది. మానవగృహ్య సూత్రంలో నలుగురు గణపతులు కనిపిస్తున్నారు. వారు నలుగురూ విఘ్న నాయకులు. యాజ్ఞ్యవల్క్యస్మృతిలో బ్రహ్మ, రుద్రుడూ, ఇరువురూ కలిసి షణ్ణామధారి అయిన గణపతిని సృజించి, మానవలోకానికి కామ్యార్థ సిద్ధ్యర్థం ప్రసాదించినట్లు చెప్పి ఉంది. గుప్తుల కాలంలో ఉన్న శిలా లేఖనాల్లో గణాధిపుని నామం కనిపించటం లేదు. కాని వారి కాలంలో నాటినది, ప్రసిద్ధి పొందిన పాలై దేవాలయ స్తంభ శిల్పాలల్లో, గణాధిపుని రూపం కనిపిస్తున్నది. ఎల్లోరాలోని రెండు గుహల్లో గణపతి శిల్పాలున్నవి. అందువల్ల గుప్తులకాలంలో అప్పుడప్పుడే ఆరంభమైన గణాధిపుని పూజ, క్రీ.శ. 3, 8 శతాబ్దాల మధ్యకాలంలో భారతదేశాన ప్రాచుర్యం వహించి ఉంటుందని చరిత్రజ్ఞులు పలుకుతున్నారు. క్రీ.శ 376 నాటి శిలాశాసనంలోని రచనవల్ల ఆ నాటికి వినాయకునికి గజానన మున్నట్లు లేదట! అది ఎలా వచ్చింది అర్థం కావటం లేదని 'మిశ్రబంధు' ఒకచోట వ్రాసినారు. ఈ గజాననము భవభూతి గ్రంథజాలంలోనూ, ఎల్లోరా శిల్పాలలోనూ, పాలై శిల్పాలలోనూ కనిపిస్తున్నది. ఋగ్వేదంలో బ్రహ్మణస్పతి సూక్తాన బృహస్పతి, గణపతి ఇరువురూ గణపతి యయినట్లు వున్నది. ఆయన రూపం క్రమక్రమంగా నేటి మూర్తిని తాల్చి వుంటుంది. ఆయనకు త్రిమూర్తుల కంటే అధికమైన స్థానం వచ్చి వుంటుంది. క్రీ.శ. 10వ శతాబ్ది నాటికి, ఆయనకు ప్రత్యేక దేవాలయాలు వచ్చినవి. తిరుచ్చి గుహా దేవాలయాలలోని 'ఉచ్చిప్ప పిళ్ళయార్ కోయిల్' కేవలం గణపతి దేవాలయంగా ప్రసిద్ధమై ఒప్పుతున్నది.
వినాయక చతుర్థినాడు మనమందరమూ మృద్గణేశుణ్ణి పూజిస్తున్నాము. శివుడు గజాసుర సంహారానికి వెళ్ళిన సందర్భంలో పార్వతి అభ్యంగన స్నానం చేస్తూ నలుచుకున్న మట్టితో ఒక విగ్రహాన్ని చేసి ప్రాణం పోసి తండ్రిని లోపలికి రానీయకుండా వాకిట చౌకీదారుగా నియమించిందట. ఆయన వచ్చి లోపలికి ప్రవేశించబోతూ ఉండగా ఇతడు అడ్డుకున్నాడని, శిరస్సు ఖండించిన తరువాత పార్వతి వల్ల సమస్తమూ తెలుసుకుని గజాననము తెచ్చి అతికించిన పిమ్మట విఘ్న నాయకుడు గజాస్యుడైనాడని మార్కండేయ పురాణ కథ వల్ల వ్యక్తమౌతున్నది. ఈ కథ వంగదేశంలోనూ ప్రచారంలో ఉంది. ఈ విషయాన్ని దుర్గాషష్ఠిని పరిశీలించటం వల్ల నిర్ధారణ చేయవచ్చును. భారతదేశంలో అనేక ప్రాంతవాసులు దుర్గాపూజ జరిపే సందర్భంలో విఘ్నేశ్వరుణ్ని ఆచారాన్ని బట్టి అయిదు దినాలో, వారము దినాలో ఉంచి తల్లితో పాటు నదికి తీసుకుపోయి అందులో కలుపుతున్నారు. దాన్ని ఆధారంగా చేసుకొని శబ్ద శాస్త్రవేత్తలూ, మానవశాస్త్రజ్ఞులు (Ethnologists) గణేశుణ్ణి భాద్రపద